ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఇండియాలో కూడా గత నెలన్నర రోజులుగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెల్సిందే. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారీ ఎత్తున కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మళ్లీ పొడగించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తివేసినా కూడా సినిమా థియేటర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగడం ఖాయం అంటున్నారు.
ఈ ఏడాది థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల దాదాపుగా అసాధ్యం అనిపిస్తోంది. ఈ సమయంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు విపరీతంగా పుంజుకున్నాయి. రెడీగా ఉన్న సినిమాలను ఓటీటీపై విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. థియేటర్లలో ఎలాగూ ఇప్పట్లో విడుదల చేయలేం కనుక ఓటీటీలో అయినా విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో కొందరు నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు సిద్దం అవుతున్నారు. ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన మొదటి తెలుగు సినిమా అమృతరామన్. ఈ సినిమాకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.
జీ5 యాప్‌లో విడుదలైన ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తం అయ్యింది. స్ట్రీమింగ్ ప్రారంభం అయిన వెంటనే పెద్ద ఎత్తున వ్యూవర్స్ సినిమాను చూశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. సినిమాలో కొత్తదనం లేకపోవడంతో పాటు చాలా రొటీన్ కథ, స్క్రీన్‌ప్లేతో సినిమా బోరింగ్‌గా సాగింది. పోస్టర్స్‌లో చూపించిన రొమాన్స్ సినిమాలో లేదు. సినిమా రెండు గంటల లోపే ఉన్నా కూడా ప్రేక్షకులు ఎక్కువ శాతం పూర్తిగా చూడకుండానే క్లోజ్ చేస్తున్నారట.
ఈ చిత్రంలో నటించిన రామ్ మరియు అమితా రంగనాథ్‌లు కాస్త పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన వారంతా కూడా బిలో యావరేజ్ నటనతో అబ్బే అనిపించారు. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి. పనిపాట లేని కుర్రాడిని మొదటి చూపులోనే హీరోయిన్ అంతగా ప్రేమించడం ఏంటో ఎవరికి అర్థం కాదు. మొత్తంగా ఓటీటీ ద్వారా వచ్చిన ఈ మొదటి ప్రయోగం విఫలం అయ్యింది. ఆరంభం నిరాశ పర్చడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.