ఏపీ అసెంబ్లీ: మళ్ళీ తెరపై ‘రాజధాని’ రగడ

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకూ గతంలో ప్రభుత్వ పెద్దలు నానా తంటాలూ పడాల్సి వచ్చిందంటే.. ఆ స్థాయిలో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది మరి. లాఠీలు విరగాయి.. అమరావతి రైతులు రక్తం చిందించారు.. అయినా, ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. అయితే, శాసన మండలిలో మాత్రం రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆగిపోయింది. మరోపక్క, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు న్యాయస్థానాన్నీ ఆశ్రయించారు. అయినాగానీ, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్ళాలనుకుంటోంది. ఆ విషయాన్ని గవర్నర్‌ ప్రసంగం ద్వారా స్పష్టం చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

నేటి నుంచి ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల్లో మరోమారు రాజధాని అంశం వాడి వేడి చర్చకు ఆస్కారమిచ్చేలా వుంది. అయితే, శాసన మండలిలో ఈ విషయమై ఏం జరుగుతుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నిజానికి, రాజధాని అంశంలో శాసన మండలిలో జరిగిన గలాటా నేపథ్యంలో ఏకంగా శాసన మండలి రద్దుకి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీర్మానించింది. ఇప్పుడీ ‘రద్దు’ అంశం కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది. కేంద్రం ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనుకోండి.. అది వేరే విషయం.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా, కర్నూలుని జ్యుడీషియరీ క్యాపిటల్‌గా ఏర్పాటు చేస్తూ, ప్రస్తుత రాజధాని అమరావతిని శాసన రాజధానిగా వుంచాలన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆలోచన. పేరుకే శాసన రాజధాని అమరావతి.. అసలు విషయం మాత్రం రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడమేనంటూ అమరావతి కోసం భూములిచ్చిన రైతులు వాపోతున్నారు.

టీడీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చిన విషయం విదితమే. లాక్‌డౌన్‌ సమయంలోనూ అమరావతి ఉద్యమం ‘నిబంధనలకు లోబడి’ కొనసాగింది. మళ్ళీ ఆ ఉద్యమం ఇప్పుడు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయినా, ఏడాది కాలంలో అమరావతిలోనే ఒక్క కొత్త నిర్మాణాన్ని అయినా చేపట్టని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, మిగిలిన నాలుగేళ్ళలో విశాఖని అయినా, కర్నూలుని అయినా అభివృద్ధి చేసేస్తుందని ఎలా అనుకోగలం.?

ఇదిలా వుంటే, గడచిన ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా చేపట్టామనీ, అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామనీ గవర్నర్‌ ప్రసంగం ద్వారా ప్రభుత్వం.. షరామామూలుగానే ‘గొప్పలు’ చెప్పుకుందని, వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా వున్నాయని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగం, గతానికి భిన్నంగా సాగింది.