దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో తెలుసా? అంటూ పట్నం వచ్చిన ప్రతివత్రల సినిమాలో నూతనప్రసాద్ క్యారెక్టర్ అదే పనిగా చెబుతున్నప్పుడు కాస్త కామెడీగా అనిపిస్తుంది. కానీ.. చాలా సీరియస్ గా అలాంటి మాటనే చెబుతున్నారు ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయిన తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకురావటం తర్వాత సంగతి.. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందంటూ ఆయన చెబుతున్న మాటలు వింటే.. గుండెల్లో రైళ్లు పరిగెత్తటం ఖాయం. తానేమీ ఉత్తగా చెప్పటం లేదంటూ ఆయన ఉదాహరణలతో సహా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబుతున్నారు.
ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆరు ప్రధాన సూచీల్లో ఐదు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పిన యనమల.. ఒక్క రాష్ట్ర వృద్ధిరేటు మాత్రమే మెరుగ్గా ఉందన్నారు. మొదటి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్) లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం యనమల నోటి నుంచి వచ్చిన మాటలు వింటే.. ఏపీ భవిష్యత్తు మీద ఆందోళనలు పెరగటం ఖాయం. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని.. దీనికి ప్రధాన కారణం గత ఆర్థిక సంవత్సరం చివర్లో నిలిపేసిన రూ.10వేల కోట్ల బిల్లుగా ఆయన చెబుతున్నారు.
అప్పుడు ఆపేసిన బిల్లుల్ని ఇప్పుడు కట్టేయటంతో ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు నెలల్లోనే రూ.49 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంగా ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పుకొచ్చారు.
ఆదాయం తక్కువగా లేకున్నా.. చెల్లింపుల భారం భారీగా ఉండటంతో ఇబ్బందికరంగా మారిందన్నారు. పాల బిల్లుల చెల్లింపులకే తొలి ప్రాధాన్యం ఇచ్చామని.. జలవనరులు.. పట్టణాభివృద్ధి.. పంచాయితీరాజ్.. హోంశాఖలకుసంబంధించి పాత బిల్లులు ఎక్కువగా ఉన్నాయన్నారు. చెల్లింపుల కారణంగా నెలకొన్న అంతరాన్ని అప్పులు.. వేస్ అండ్ మీన్స్ తో భర్తీ చేస్తున్నామన్నారు.
ఇప్పటివరకూ రూ.4వేల కోట్ల అప్పులు.. రూ.150 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్ తో భర్తీ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు గడ్డు పరిస్థితిని మరో మూడు నెలలు కొనసాగుతుందని.. దీనికి చెక్ పెట్టకుంటే రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందన్నారు. ఈసారి వివిధ శాఖలకు బడ్జెట్ లోకేటాయించిన దాని కంటే ఎక్కువ నిధులు అడుగుతున్నాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి సాధ్యం కాదని తేల్చారు. తొలి ఏడాది రెవెన్యూ లోటు కింద వచ్చేది ఇంకా రూ.138 కోట్లు మాత్రమేనని కేంద్రం లెక్కలు చెబుతోందని.. తమ లెక్కలు తమకు ఉన్నాయన్నారు. ఎవరి లెక్కలు వారివే అయినా.. అంతిమంగా కేంద్రం మాటే చెల్లుబాటు అవుతుందన్న విషయాన్ని యనమల చెప్పకపోవటం గమనార్హం.