తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకూ పెరుగుతోంది. ఏ దశలోనూ కేసుల సంఖ్య తగ్గట్లేదు. పరిస్థితి కొంచెం మెరుగైందని ఉదయం అనుకుంటే.. సాయంత్రానికి తీవ్రత తెలిసొస్తోంది. పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మార్వోకు కరోనా సోకినట్లు వెల్లడైంది. ఫలితంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర సిబ్బంది క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
అనంతరంపురం జిల్లాకు చెందిన ఓ తహశీల్దారు.. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎమ్మార్వోకు కరోనా ఉన్నట్లు బయటపడింది. దీంతో ఎమ్మెల్యే కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
సమావేశంలో పాల్గొన్న మిగతా వారికీ క్వారంటైన్ తప్పట్లేదు. ఎమ్మార్వోతో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. వీరిలో ఇప్పటికే పలువురిని గుర్తించి క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
ఎమ్మార్వో డ్రైవర్, అటెండర్‌తో పాటు పలువురికి పరీక్షలు చేశారు. వారి రిపోర్టులు రావాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు చనిపోయారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది. సోమవారం సాయంత్రం 5 నుంచి మంగళవారం ఉదయానికి మధ్య 34 కేసులు నమోదవడం గమనార్హం.