ఆంధ్రప్రదేశ్‌లో యెల్లో వైరస్‌ వర్సెస్‌ బులుగు వైరస్‌.!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దెబ్బకు విలవిల్లాడుతోంటే, ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ‘బులుగు’ వైరస్‌ కారణంగా భయభ్రాంతులకు గురవుతోంది. ఇక్కడ బులుగు వైరస్‌ అంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.! ఇంకో వైరస్‌ కూడా రాష్ట్రానికి శనిలా పట్టిందట.. అది కరోనా కంటే తీవ్రమైనదని వైఎస్సార్సీపీ అంటోంది ఆ వైరస్‌ పేరు ‘యెల్లో’ వైరస్‌.

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, రాజకీయ నాయకులు ఎన్నయినా చెబుతారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా ఎందుకు పెరిగాయి.? అక్కడ అధికారులకు సైతం కరోనా ఎందుకు సోకింది.? అంటే, ‘బులుగు వైరస్‌’ కారణంగానేననే చర్చ దేశమంతటా జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిది¸ అత్యుత్సాహం శ్రీకాళహస్తి నియోజకవర్గానికే కాదు, మొత్తం చిత్తూరు జిల్లాకు శాపంగా మారిందంటూ నేషనల్‌ మీడియా ఓ పక్క కడిగి పారేస్తోన్న విషయం విదితమే.

తమను ‘బులుగు వైరస్‌’గా దేశమంతటా అభివర్ణించడాన్ని తట్టుకోలేకపోతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ‘యెల్లో’ వైరస్‌.. అంటూ తెలుగుదేశం పార్టీని సీన్‌లోకి లాగుతుండడం గమనార్హం. సరే, ప్రతిపక్షం అనగానే అడ్డగోలు విమర్శలు చేయక తప్పదన్న బలమైన అభిప్రాయం జనంలోనూ పాతుకుపోయింది గనుక.. టీడీపీ చేసే విమర్శల్ని పూర్తిగా ‘తప్పు’ అని కొట్టి పారేయలేం. అయినాగానీ, టీడీపీ సైతం ఈ సమయంలో దిక్కుమాలిన రాజకీయాలు చేయడం సబబు కాదు.

అధికారం వైసీపీ చేతుల్లో వుంది గనుక, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతల మీదనే వుంటుంది. దురదృష్టవశాత్తూ వైరస్‌ వ్యాప్తిలో తమవంతు కీలక పాత్ర వైసీపీ నేతలే పోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. చేసింది చాలక.. చేతకాని కబుర్లు సోషల్‌ మీడియా వేదికగా వైసీపీ నేతల నుంచి వస్తున్నాయంటే.. అసలు వారి ఉద్దేశ్యమేంటట.? అన్న అనుమానాలు కలగకుండా ఎలా వుంటాయ్‌ సాధారణ ప్రజానీకానికి.

‘చంద్రబాబూ నువ్వు దోమలపై యుద్ధం చేసి గెలిచావా.?’ అంటూ ఓ అమాయకమైన ప్రశ్న వేసేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. దోమలూ, వైరస్సూ ఒక్కలాంటివేనా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది విజయసాయిరెడ్డి ప్రస్తావన. చంద్రబాబు తన హయాంలో దోమల్ని అరికట్టలేదుగనుక, వైఎస్‌ జగన్‌ తన హయాంలో కరోనా వైరస్‌ని అరికట్టబోరన్నట్లుంది విజయసాయిరెడ్డి మాటల తీరు. ఇందుకే కదా.. వైసీపీని ‘బులుగు వైరస్‌’ అని దేశమంతా కీర్తిస్తున్నది.?