ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ కోరిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? సరే, ప్రభుత్వాలు కోరుతున్నట్లు పరిస్థితులు వున్నాయా! అంటే అది వేరే విషయం.

ఇక, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్‌.? ప్రజలకు కరెంటు బిల్లుల విషయంలో కావొచ్చు, పన్నుల విషయంలో కావొచ్చు ఏమన్నా ఊరటనిస్తున్నాయా.. అంటే అదీ లేదు. పైగా, టైవ్‌ు చూసి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచేసింది ప్రభుత్వం. పెంచడమంటే, శ్లాబుల మార్పు చేయడం. ఈ కారణంగా చాలా బిల్లుల్లో తేడాలొచ్చేశాయి. దానికి తోడు, రెండు నెలలకు ఓ సారి రీడింగ్‌ తీయడంతో బిల్లులో ‘ఫిగర్‌’ పెద్దగా కన్పించింది. అంటే, డబుల్‌ ధమాకా అన్నమాట.

‘అబ్బే, మేం పెంచింది పెద్దగా ఏం లేదు.. పైగా పెంచాలన్న నిర్ణయం గతంలోనిదే.. రెండు నెలల బిల్లు ఒకేసారి కన్పించేసరికి ఎక్కువగా వుంది. కావాలంటే వాడిన యూనిట్లు చూడండి.. దాన్ని బ్యాలెన్స్‌ చేసిన విధానాన్ని గుర్తించండి..’ అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.

మరోపక్క ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పట్టుకుని చెయ్యాల్సినదానికంటే ఎక్కువ యాగీ చేసేస్తోంది. ఇక్కడే, టీడీపీ బొక్క బోర్లా పడిపోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌.. ఇద్దరూ తమ తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో విద్యుత్‌ బిల్లుల్ని పెట్టారు. వాటిల్లో బిల్లు ఎక్కువగా కన్పిస్తున్న మాట వాస్తవం. అదే సమయంలో, ఆ బిల్లుల్లో నమోదైన యూనిట్స్‌ చాలా ఎక్కువగా వున్నాయన్న విషయాన్ని మాత్రం విస్మరించారు.

ఓ పోస్ట్‌లో అయితే సర్వీస్‌ నెంబర్లు లేకుండా బిల్లులున్నాయ్‌. ఈ తరహా వ్యవహారాలతో, టీడీపీకి మైలేజ్‌ రావడం లేదు సరికదా.. అభాసుపాలవుతోంది. చిత్రంగా వైసీపీ మద్దతుదారులకి ఇవి అడ్వాంటేజ్‌గా మారిపోతున్నాయి టీడీపీని ట్రోల్‌ చేయడానికి. గ్రౌండ్‌ లెవల్‌లో విద్యుత్‌ బిల్లుల్ని పరిశీలించి, ఆ వివరాల్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రతిపక్షంగా టీడీపీకి అది అడ్వాంటేజ్‌ అవుతుంది. ఇక, విద్యుత్‌ బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలన్న చంద్రబాబు డిమాండ్‌ ఓ రకంగా సమంజసంగానే వున్నా.. విద్యుత్‌కీ చంద్రబాబుకీ వున్న అవినాభావ సంబంధం నేపథ్యంలో ఆయనసు అందుకు అర్హుడే కాదన్న విమర్శలూ లేకపోలేదు.