ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహ్మాన్ కూడా బాలీవుడ్ నెపొటిజం బాధితుడే అంటూ తేలిపోయింది. తాజాగా దిల్ బేచారా ప్రమోషన్ లో భాగంగా ఒక రేడియో ఇంటర్వ్యూలో రహ్మాన్ మాట్లాడుతూ బాలీవుడ్ లోని ఒక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా బాలీవుడ్ మాఫియా అంటూ కొందరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో రహ్మాన్ కూడా బాలీవుడ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
ఆ రేడియో ఇంటర్వ్యూలో రహ్మాన్ మాట్లాడుతూ.. బాలీవుడ్ లో కొందరు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫర్లు నా వరకు రాకుండా కొందరు నా గురించి తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారు. నాతో వర్క్ చేస్తే సినిమా ఆలస్యం అవుతుందని సమయంకు ట్యూన్స్ ఇవ్వను అంటూ పలు సినిమాలను నా వరకు రాకుండానే చేశారు. దాంతో కొన్ని సినిమాలు నా వరకు వచ్చినట్లే వచ్చి చేజారి పోతున్నాయి. కొన్ని అసలు నా వరకు రానుకూడా రావడం లేదు.
సౌత్ వాడిని అవ్వడం వల్లే వారు ఇలా చేస్తున్నారనే అనుమానంను రహ్మాన్ వ్యక్తం చేశాడు. దిల్ బేచారా దర్శకుడిని కూడా పలువురు రహ్మాన్ తో వద్దంటూ హెచ్చరించారట. ఆయన మాత్రం రహ్మాన్ తో వర్క్ కు ఆసక్తి చూపించి ఎవరి మాట వినిపించుకోకుండా తన సినిమాకు ఆయనతో వర్క్ చేయడం జరిగింది. రహ్మాన్ కు నెటిజన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. రహ్మాన్ ను బాలీవుడ్ కు దూరం చేయాలని ప్రయత్నిస్తున్న వారిని నెటిజన్స్ హెచ్చరించారు. నెపొటిజం కారణంగా ఇప్పటి వరకు బలి అయినది చాలు ఇంకా జనాలను బలి తీసుకోవాలనుకుంటే మీ భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లడం ఖాయం అంటూ వారిని రహ్మాన్ అభిమానులు హెచ్చరించారు.