హీరోయిన్‌పై ఫైర్‌ అయిన సింగర్‌

హీరోలు, హీరోయిన్లు అడపాదడపా తమ బాత్రూమ్‌ సింగింగ్‌ టాలెంట్‌ని సినిమాల్లో ప్రదర్శించేది తెలిసిందే. ఒకరిద్దరు మినహా చాలా మంది యాక్టర్లు ఆటో ట్యూన్‌ సాయంతో సింగర్స్‌ అనిపించేసుకుంటూ వుంటారు. అయితే పబ్లిక్‌ వేదికల్లో, అదీ సంగీత పరమైన కార్యక్రమాల్లో తమ టాలెంట్‌ చూపిస్తామంటూ హీరోయిన్లు తయారైపోతే ప్రొఫెషనల్‌ సింగర్స్‌కి ఒళ్లు మండుతుంది.

అలాగే జస్టిన్‌ బీబర్‌ కాన్సర్ట్‌లో పాడేందుకు సిద్ధమవుతోన్న బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా గురించి సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ ఓపెన్‌గానే విమర్శించాడు. నటులు, గాయకులు వేరని, ఎవరి ప్లాట్‌ఫామ్‌ వారికి వదిలేస్తే మంచిదని సూచించాడు. దీనికి సోనాక్షి హర్ట్‌ అయి, కొత్త ఆర్టిస్ట్‌ వచ్చినపుడు ఎంకరేజ్‌ చేయాలి కానీ ఇలా మాట్లాడడం సబబు కాదని అంది. అలాగే నూర్‌ సినిమాలో తనని పాడమంటూ అడిగినపుడు ఏమైందంటూ అర్మాన్‌ని నిలదీసింది.

అది అడిగింది తాను కాదని, తన సోదరుడు అమాల్‌ మాలిక్‌ అని అతను సరిచేసాడు. ఇద్దరూ కలిసే వచ్చి రిక్వెస్ట్‌ చేసారంటూ సోనాక్షి మరో రాగం అందుకుంది. దానికి ఆమెని కామెడీ చేస్తూ ఆ సింగర్‌ ఒక స్మయిలీ వేసాడు. మొత్తానికి వీరిద్దరి ఆర్గ్యుమెంట్‌ ట్విట్టర్లో కాస్త కాలక్షేపానికి అవకాశమిచ్చింది. సోషల్‌ మీడియా వల్ల ప్రైవేట్‌గా జరగాల్సిన కాన్వర్‌జేషన్లు పబ్లిక్‌ వేదికనెక్కి జనాలకి సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.