‘బాహుబలి-2’ అంత పెద్ద సినిమానా?

‘బాహుబలి’ని ఒక్క సినిమాగానే చేయాలనే అనుకుంది రాజమౌళి బృందం. ఐతే నిడివి ఎక్కువవుతోందని.. రెండు భాగాలుగా చేస్తే అన్ని రకాలుగా మంచిదని ‘ది బిగినింగ్’.. ‘ది కంక్లూజన్’ అంటూ రెండు పార్ట్‌లుగా సినిమాను తీశారు.

ఐతే తొలి భాగమే రెండున్నర గంటలకు పైగా నిడివి వచ్చింది. ముందు అనుకున్న స్క్రిప్టులో మార్పులేమీ చేయలేదని.. కొత్త సన్నివేశాలేమీ చేర్చలేదని రాజమౌళి చెప్పిన నేపథ్యంలో రెండో భాగం నిడివి మరీ ఎక్కువేమీ ఉండదని అంతా అనుకున్నారు. ‘ది కంక్లూజన్’ నిడివి రెండు గంటలకు కొంచెం ఎక్కువగా ఉంటుందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదట.

రెండో భాగం నిడివి 2 గంటల 50 నిమిషాల వరకు వచ్చినట్లు స్వయంగా రాజమౌళే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఐతే ఈ నిడివిని కొంచెం తగ్గించే ప్రయత్నాల్లో ఉందట ‘బాహుబలి’ టీం. ఎంత తగ్గించినా ఓ పది పదిహేను నిమిషాలకు మించి కోత పెట్టేందుకు అవకాశం లేదట. కాబట్టి నిడివి విషయంలో ‘ది బిగినింగ్’కు దీటుగానే ‘ది కంక్లూజన్’ కూడా ఉండబోతోంది.

ఐతే ఈ మధ్య కాలంలో సినిమాల నిడివి చాలా తక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. చాలా సినిమాలు రెండుంబావు గంటలకు మించట్లేదు. కానీ అలాంటి రూల్స్ ‘బాహుబలి’కి వర్తించవు. ఇలాంటి విజువల్ వండర్స్‌కు లెంగ్త్ ఇంకా ఎక్కువుండాలనే కోరుకుంటారు ప్రేక్షకులు. కాబట్టి జక్కన్న చెప్పిన 2 గంటల 50 నిమిషాల నిడివి ఉన్నా వచ్చే ఇబ్బందేమీ లేకపోవచ్చు.