బిగ్ వార్: బాలయ్య వ్యాఖ్యలపై సి.కళ్యాణ్ పేస్ వేల్యూ లేదంటూ కౌంటర్ అటాక్.!

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రభుఖులంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరిపారు. దానికి ఫలితంగా జూన్ నుంచి షూటింగ్స్ మొదలు పెట్టేలా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ ఘాట్ ని విజిట్ చేసిన టైంలో బాలకృష్ణ ఇదే విషయంపై ‘నన్నెవరూ ఏ మీటింగ్ కి పిలవలేదంటూ’ ఘాటుగా స్పందించారు.

ఇది జరిగిన కాసేపటికి బాలకృష్ణ బసవతారకంలో పలువురికి నిత్యావసరాలు పంచడానికి హాజరైనప్పుడు ‘నన్నొక్కరు పిలవలేదు, గ్రూపులు గ్రూపులుగా కూర్చొని సినిమా మంత్రితో భూములు పంచుకుంటున్నారా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా?’ అంటూ రెండు బీప్స్ పడే మాటలు కూడా వాడారు బాలకృష్ణ.

ఈ విషయంపై ఎవరూ ఊహించని విధంగా నిర్మాత సి. కళ్యాణ్ ఘాటుగా మీడియాలో వివరణ ఇచ్చారు. ‘ మొదటగా ఇది ఆర్టిస్టులందరినీ పిలిచే మీటింగ్ కాదు. నిర్మాతలకు మాత్రమే సంబందించినది కాబట్టే ఈ మీటింగ్ కి బాలకృష్ణను పిలవలేదు. ప్రస్తుతం చిరంజీవి పేస్ వ్యాల్యూ మా నిర్మాతలకి అవసరం. ఆయనుంటే కచ్చితంగా పని జరుగుతుందనుకున్నాం, అలానే నాగార్జున గారున్నా పనవుతుందని అనుకున్నాం, అందుకే వారిని పిలిచాం. ఒక్కమాటలో చెప్పాలంటే మాకు ఎవరితో ఈజీగా పని జరుగుతుందంటే వారినే పిలుస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మాకు బాలయ్యతో పనవుతుంది కాబట్టి, బాలకృష్ణ గారినే ముందు ఉంచేవాళ్ళం. ఇలా ఎవరితో పని జరుగుద్దో వారిని పిలిచి మా పని పూర్తి చేసుకుంటామే తప్ప సినిమా ఇండస్ట్రీలో గ్రూపులు లేవని” సి కళ్యాణ్ స్పష్టం చేసారు.

సి కళ్యాణ్ కామెంట్స్ విన్న అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే సి కళ్యాణ్ బాలయ్యకి సన్నిహితుడు, సోదర సమానుడు అంటుంటారు. అలాగే ఆయన బాలయ్యతో మూడు సినిమాలు(పరమవీరచక్ర, జై సింహా, రూలర్) కూడా చేశారు. మరోవైపు ‘ఎన్.టి.ఆర్’ సినిమాతో బాలయ్య కూడా నిర్మాతగా మారాడు. దాంతో కొందరు అభిమానులు, సినీ వర్గాల వారు బాలయ్య నిర్మాతగా మారిన విషయం సి కళ్యాణ్ కి తెలియదా? బాలయ్యకి పేస్ వాల్యూ లేదా? అసలు అక్కడ చర్చకి వచ్చిన వాళ్లంతా నిర్మాతలేనా?? అని ప్రశ్నిస్తున్నారు.