బాలయ్య “శివశంకరీ..” ఎందుకు పాడాల్సి వచ్చిందంటే?

నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక కానుక ఇచ్చాడు. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ చిత్రంలోని ఐకానిక్ సాంగ్ శివశంకరీను తనదైన శైలిలో పాడారు బాలకృష్ణ. సంగీత జ్ఞానం ఉన్న వాళ్లకు ఈ పాట పాడటం అంత సులువైన విషయం కాదు. గమకాలు, శృతి ఇలా అన్ని విషయాల్లోనూ ఈ పాట క్లిష్టంగానే ఉంటుంది. అలాంటి పాటను ఎంపిక చేసుకోవడం ఒక రకంగా బాలకృష్ణ సాహసం చేశారనే చెప్పాలి. అయితే ఈ పాట విషయంలో చాలా మంది బాలయ్య మంచి ప్రయత్నం చేసాడనే అంటున్నారు. అదే విధంగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి అది వేరే విషయం లెండి.

ఇక అభిమానులకు పాట పాడి గిఫ్ట్ ఇవ్వాలంటే బాలయ్య వేరే పాటను ఎంచుకోవచ్చు. సులువుగా పాడేసేది ఎంచుకుని మ్యానేజ్ చేయవచ్చు కానీ ఇలాంటి క్లిష్టతరమైన పాటను ఎంచుకుని తన నైజాన్ని చాటుకున్నారు బాలయ్య. తనేమీ ప్రొఫెషనల్ సింగర్ కాదు, అయినా కూడా బాలయ్య ఈ పాటను ఎంచుకుని పాడిన విధానానికి మెచ్చుకుని తీరాలి.

ఇక అసలు ఈ పాటనే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించారు బాలకృష్ణ. “శివ శంకరీ పాటను పాడడానికి ఎవరూ సాహసించరు. అది చాలా క్లిష్టతరమైన పాట. ఎవరూ చేయని సాహసం కాబట్టే నేను చేసాను. నేనేమి అద్భుతంగా పాడలేదని తెలుసు కానీ నాకు పాడాలనిపించి పాడాను” అని వివరించారు బాలయ్య.