‘ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ కోసం నేనున్నాను.. మీ తరఫున నేను నిలబడతాను..’ అంటూ సినిమాటిక్ డైలాగుల్ని షరామామూలుగానే పేల్చేశారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ఎమ్మెల్యేగా తనను రెండు సార్లు అనంతపురం జిల్లా హిందూపురం ప్రజానీకం గెలిపించినా, నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో వుండరు. సినిమాల్లో బిజీగా వుంటారు కదా.. అందుకే మరి.! అయితే, సినిమా షూటింగుల నుంచి కాస్త విరామం దొరికినా, నియోజకవర్గంలో మకాం వేద్దాం.. అక్కడ పరిస్థితుల్ని తెలుసుకుందాం.. అనే సోయ బాలయ్యకు వుండదు.
అడపా దడపా చుట్టం చూపు కోసం సొంత నియోజకవర్గానికి బాలకృష్ణ వెళుతుంటారు.. ఈ క్రమంలో అభిమానులెవరైనా కొంచెం ఉత్సాహం ప్రదర్శిస్తే చాలు, చెంప దెబ్బల్ని బహుమతిగా ఇస్తుంటారీ నందమూరి నట సింహం. ఆ ‘స్వీట్ పెయిన్’ భరించలేక, అక్కడి నుంచి అభిమానులు జారుకోవాల్సిందే. బాలయ్య టూర్ సందర్భంగా గూబలు పగిలిపోవడమే కాదు, సెల్ ఫోన్లు కూడా పగిలిపోతుంటాయ్. దటీజ్ బాలయ్య. సరే, ఆ సంగతి పక్కన పెడితే, వైఎస్ జగన్ సర్కారు మీద బాలయ్య విరుచుకుపడిపోయారు. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మేలు జరగడంలేదంటూ గుస్సా అయ్యారు. కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో మాట్లాడిన బాలయ్య, ‘ఈ ప్రభుత్వం ఎంతో కాలం వుండదు..’ అని సెలవిచ్చారు. కానీ, పంచాయితీ ఎన్నికల వేళ, అభిమానుల్ని ఉద్దేశించి ఓ పిలుపు కూడా ఇవ్వలేకపోయారు బాలయ్య.. అంతలా పార్టీ కోసం బాలయ్య కష్టపడిపోతున్నారు.
అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయడానికి బావ చంద్రబాబు ఎన్ని తంటాలు పడుతున్నా, బాలయ్యకు అవేమీ పట్టవు. మీడియా ముందుకొస్తే మాత్రం, ‘అదరగొట్టేస్తాం.. బెదరగొట్టేస్తాం.. మా వంశం.. ’ అంటూ ఏవేవో చెబుతుంటారు. బాలయ్యకు బోల్డంత ఛరిష్మా వుంది సినీ నటుడిగా. రాజకీయాల్లో అతని అభిమానించే చాలామంది నాయకులున్నారు. కానీ, ఏం లాభం.? చంద్రబాబు డైరెక్షన్ నుంచి ఏమాత్రం పక్కకు వెళ్ళరు బాలయ్య. అదే బాలయ్యతో అతి పెద్ద సమస్య.. అని ఆయన మీద ఆశలు పెట్టకున్న ఎంతోమంది టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు, హిందూపురం నియోజకవర్గ ప్రజలూ చెబుతుంటారు.