దసరా బరిలో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా లేదనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో మిగతా సినిమాలన్నీ ఫెస్టివల్ స్లాట్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. అఖిల్ అక్కినేని – పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం అక్టోబర్ 8వ తేదీని గీతా ఆర్ట్స్ వారు బ్లాక్ చేశారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘కొండ పొలం’ చిత్రాన్ని కూడా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలానే శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్దార్థ్ కలిసి నటించిన ‘మహాసముద్రం’ చిత్రం అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
అలానే దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి అరంగేట్రం మూవీ ‘రౌడీ బాయ్స్’ ను కూడా దసరా బరిలో దింపుతున్నారు. హోమ్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు పండగ సీజన్ కోసం రెడీ అవుతున్నాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి – కొరటాల శివ ల ‘ఆచార్య’ సినిమా రేసులో లేదని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. బాలకృష్ణ సినిమాని బరిలో నిలుపుతారని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అక్టోబర్ 8 – 13 రెండు డేట్లలో ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘అఖండ’ చిత్రం అక్టోబర్ లో వచ్చేది నిజమే అయితే ఈ సీజన్ లో వచ్చే పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఇది బాలయ్య సినిమాకి సువర్ణావకాశం కూడా. అయితే దీని కారణంగా కొన్ని చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకుంటామని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చివరకు దసరా పండుగకు ఏయే సినిమాకమాలు థియేటర్లలోకి వస్తాయో చూడాలి.