బాలయ్యా.. రాజీనామా చెయ్.! వైసీపీ బస్తీ మే సవాల్.!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలట. తద్వారా ఏర్పడే ఉప ఎన్నికల్లో బాలయ్య గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామెడీకే ఇది పరాకాష్ట.

బాలయ్య వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా.? లేదా.? అన్నది అప్పటి రాజకీయ పరిస్థితుల్ని బట్టి ఆధారపడి వుంటుంది. 2019 ఎన్నికల్లో బాలయ్య చేతిలోనే ఇక్బాల్ ఓడిపోయిన విషయం విదితమే. అయినా, బాలయ్య రాజీనామా చెయ్యడమెందుకు.? వైసీపీ చేతిలోనే అధికారం వుంది. ఎప్పుడంటే అప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఎటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితమైపోయిందని వైసీపీ గట్టిగా చెబుతోందాయె.

ఇంకోపక్క, పలువురు టీడీపీ ప్రజా ప్రతినిథులు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయి.. ఎచక్కా 175 అసెంబ్లీ సీట్లూ, 25 ఎంపీ సీట్లూ గెలిచేసుకోవచ్చు కదా.? కానీ, ఆ పని వైసీపీ చెయ్యదు. స్థానిక ఎన్నికలు వేరు, మిగతా ఎన్నికలు వేరు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో గెలవడానికి వైసీపీ ఎన్ని అడ్డదార్లు తొక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి పేరు చెప్పుకోలేని కొడుకు, భర్త పేరు చెప్పుకోలేని భార్య.. ఆ ఉప ఎన్నికలో ఓట్లేసేందుకు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. వందలాది మంది ఫేక్ ఓటర్లను వైసీపీ, అక్రమ మార్గాల్లో పోలింగ్ బూత్‌ల వద్దకు తరలించాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటివి సాధ్యపడవు. ఇవన్నీ వైసీపీకి బాగా తెలుసు.

అయినా, బాలయ్య చేతిలో ఓసారి ఓడిపోయిన వ్యక్తి.. బాలయ్యని రాజీనామా చెయ్.. అంటూ డిమాండ్ చేసెయ్యడమేంటో.? అన్నిటికీ మించి వైసీపీ – టీడీపీ మధ్య నడుస్తోన్న 60 – 40 బంధం బయటపడకూడదనే ఇలాంటి సిల్లీ డ్రామాల్ని వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారని అనుకోవాలా.? ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి దూకేసిన ప్రజా ప్రతినిథులతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేని వైసీపీ, ‘బస్తీ మే సవాల్’ అంటోంటే వినడానికే హాస్యాస్పదంగా వుంది మరి.