‘పాత బస్తీని మేం భాగ్యనగరంగా మార్చుదామనుకుంటున్నాం.. భాగ్యనగరాన్ని మీరు పాత బస్తీలా మార్చాలనుకుంటున్నారు.. అసలు పాత బస్తీలో అభివృద్ధి ఎక్కడుంది.? అభివృద్ధి లేకపోయినా, పాతబస్తీ ప్రజలు కొందరికి మాత్రమే ఎందుకు ఓట్లేస్తున్నారు.?’ అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులు చెరిగేశారు టీఆర్‌ఎస్‌పైనా, మజ్లిస్ పార్టీపైనా.
గ్రేటర్ వరదల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం ఆపేయాలంటూ బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి లేఖ రాశారన్నది టీఆర్‌ఎస్ అభియోగం. ఈ విషయమై సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ లేఖ విడుదల చేశారు. అయితే, అది ఫేక్ లెటర్ అనీ, అందులో తన పేరుతో వున్న సంతకం ఫోర్జరీ అనీ బండి సంజయ్ చెబుతున్నారు. చెప్పడమే కాదు, పాత బస్తీలోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తానన్నారు.. చేసి చూపించారు కూడా.
‘నేను వెళుతున్నా.. ముఖ్యమంత్రికి ధైర్యముంటే ఆయనా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలి..’ అంటూ సవాల్ విసిరారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పొలిటికల్ హీట్ పెరిగింది. తొలుత, బండి సంజయ్ పాత బస్తీ టూర్‌కి అనుమతి లేదని పోలీసులు అన్నారు. ఆ తర్వాత, తాము ఎవర్నీ అడ్డుకోవడంలేదనీ.. వ్యక్తులకు ప్రత్యేక అనుమతి అవసరం లేదన్నారు. బండి సంజయ్ వెళ్ళారు.. ప్రమాణం చేశారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా ఈ విషయమై స్పందించలేదు.
కేసీఆర్ సంగతి సరే, కేసీఆర్ తరఫున కేటీఆర్ కావొచ్చు, మరో టీఆర్‌ఎస్ నేత కావొచ్చు ఈ సవాల్‌ని స్వీకరించకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో పాత బస్తీకి బీజేపీ నేతలు ఓ రాజకీయ సవాల్‌తో వెళ్ళడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పెద్దయెత్తున పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.. దాంతో అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు. పరిస్థితి ప్రశాంతంగానే మారింది కాస్సేపటికే.
మొత్తమ్మీద, విసిరిన సవాల్‌లో బండి సంజయ్ గెలిచారు.. కేసీఆర్ ఓడిపోయినట్లే లెక్క. ఇంతకీ, ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి రాసిందెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. బీజేపీని టార్గెట్ చేయబోయి, తాను తీసిన గోతిలో టీఆర్‌ఎస్ తానే పడిందని అనుకోవాలా.! లేదంటే, ఈ లేఖ వెనుక మజ్లిస్ పాత్ర ఏమైనా వుందా.? దాన్ని తేల్చాల్సిన బాధ్యత కూడా బీజేపీ మీదనే వుంది.