జీహెచ్ఎంసీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ మధ్య రసవత్తర పోరుకు తెరదీస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రక్రియ మొదలుకానుండగా హైదరాబాద్ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. నగరంలోని నెక్లెస్ రోడ్డు ఇందుకు వేదిక అయింది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పీపుల్స్ ప్లాజాకు వచ్చారు. ఈ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకున్నారు. సంజయ్ తన కారులో నగదుతో వచ్చి పంపిణీకి సిద్ధపడ్డారని ఆరోపించారు. ఖైరతాబాద్ టీఆరఎస్ అభ్యర్ధి విజయా రెడ్డి అక్కడకు చేరుకుని లేక్ వ్యూ పోలిస్ స్టేషన్ సమీపంలోని ఓ హోటల్ కు వెళ్లిన సంజయ్ ను ప్రశ్నించారు. దీంతో అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. డివిజన్లో సంజయ్ డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు.
వెంటనే పోలీసులు సంజయ్ సొంత వాహనంలో తరలించారు. అయన వెనుకనే పార్టీ కేటాయించి వాహనం కూడా వెళ్తూండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ కారును టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడితో కారు అద్దాలు పగిలిపోయాయి. సంజయ్ ఉన్న కారు వెళ్లిపోవడంతో ఈ దాడి నుంచి సంజయ్ తప్పించుకున్నారు. అయితే.. దాడి చేసిన కారులో సంజయ్ ఉన్నారనే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసారనే వార్తలు కూడా వస్తున్నాయి.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ కార్యకర్తలు ఖండించారు. ఆ సమయంలో హుస్సేన్ సాగర్ పరిశీలనకు మాత్రమే సంజయ్ వచ్చారని అంటున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో హుటాహుటిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.