రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన అంశం విజయవాడ గ్యాంగ్. తమ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలను డీసీపీ హర్షవర్ధన్ మీడియా సమావేశంలో వివరించారు.
సెటిల్ మెంటే కారణం..
పండు-సందీప్ వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ సెటిల్‌మెంట్ విషయంలోనే జరిగిందని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. అపార్ట్‌మెంట్ విషయంలో సెటిల్‌మెంట్ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సందీప్ హత్యకు 13మంది, పండుపై దాడికి 11మంది కారణమని.. వీరందరినీ అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదట పండు ఇంటికెళ్లి సందీప్ బెదిరిస్తే.. తర్వాత సందీప్ షాప్ కు వెళ్లి కత్తితో పండు హల్‌చల్ చేశాడన్నారు.
హత్యకు దారి తీసిన పరిస్థితులు..
ఈ హత్య జరగడానికి ప్రధాన కారణం సందీప్ వర్గంలోని కిరణ్ కుమార్ అని వివరించారు డీసీపీ. ఇతను మంగళగిరి రౌడీషీటర్. ‘పండు-సందీప్ వర్గాలు కలుసుకున్నప్పుడు సందీప్ గ్యాంగ్ ముందు పండు కుర్చీలో కూర్చున్నాడు. సందీప్ గ్యాంగ్ వచ్చినప్పుడు పండు కుర్చీలో నుంచి లేవకపోవడంతో.. ‘పిల్లోడివి.. నా ముందే కుర్చుంటావా’ అంటూ కిరణ్ కుమార్ కర్రతో రెండు సార్లు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా గొడవ చెలరేగిందని వివరించారు.
అందరూ క్రిమినల్సే..
రెండు గ్యాంగుల్లోని వారంతా క్రిమినల్సే. మంగళగిరి, తాడేపల్లిలోని రౌడీషేటర్లందరినీ అదుపులోకి తీసుకున్నాం. ఈ గొడవ సమయంలో సందీప్ తన ఫ్రెండ్స్‌నే తీసుకెళ్లాడు. వీళ్లంతా స్కూల్ దశ నుంచీ పరిచయం ఉన్నవారే. బెదిరించాలని వెళ్తే.. చంపుకునేంత వరకూ వెళ్లింది.
తేజస్విని వాదనలో నిజం లేదు..
సందీప్ హత్య వెనుక రాజకీయ కోణం ఉందన్న భార్య తేజస్విని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు డీసీపీ. హత్య వెనుక రాజకీయ నాయకులెవరూ లేరని తేల్చి చెప్పారు. కిరణ్ రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగి హత్యకు కారణమైందని చెప్పారు. నిందితుల్లో ముగ్గురు మంగళగిరికి చెందినవారు.
పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ..
పండు తల్లికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉందని వివరించారు. ఓ కేసులో ఆమె పేరు ఉందని తెలిపారు. గొడవలో ఆమె పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని.. ఆమె హస్తం ఉన్నట్టు తేలితే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.
ఈ సమావేశంలో కేసుకు సంబంధించి ఉన్న వారిని.. సీసీ ఫుటేజీని మీడియా ముందు ప్రజెంట్ చేశారు డీసీపీ.