కరోనా నేపథ్యంలో ఆలస్యమవుతూ వచ్చిన ”భీమ్లా నాయక్” సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహా శివరాత్రి వారంలో ఫిబ్రవరి 25న తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాని మల్టీస్టారర్ గా ప్రమోట్ చేయకపోవడంపై దగ్గుబాటి ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ చిత్రాన్ని అధికారిక తెలుగు రీమేక్. అక్కడ బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తుండగా.. పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన రిటైర్డ్ హవల్దార్ పాత్రలో రానా కనిపించనున్నారు.
వాస్తవానికి మలయాళంలో ఇద్దరు హీరోల పాత్రలకు ఈక్వెల్ ప్రాధాన్యత ఉంటుంది. సమజ్జీవులైన ఇద్దరు వ్యక్తుల మధ్య అహం ఆత్మాభిమానం వల్ల వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితులే ఈ సినిమా కథాంశం. ఒకరికొకరు ఎక్కడా తగ్గకుండా.. ఇద్దరి పాత్రలు నువ్వా నేనా అన్నట్లు పోటీపోటీగా ఉంటాయి. అందుకే రెండు పాత్రల పేరులు వచ్చే విధంగా ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ అనే టైటిల్ ను పెట్టారు.
కానీ ఇక్కడ తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికి దీన్ని మల్టీస్టారర్ గా కాకుండా.. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సోలో మూవీ అనేలా మార్చేశారని మొదటి నుంచీ కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో పవన్ పోషించిన ‘భీమ్లా నాయక్’ పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడంతో అందరూ ఓ ఐడియాకి వచ్చారు. సినిమా బిజినెస్ ను మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని సర్దిచెప్పుకోవచ్చు.
కాకపోతే ప్రమోషన్స్ లో కూడా రానాకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా చేయడం.. కనీసం దీన్నొక మల్టీస్టారర్ గా జనాల్లోకి తీసుకెళ్లకపోవడంపై దగ్గుబాటి అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ‘భీమ్లా నాయక్’ నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటలన్నీ పవన్ కళ్యాణ్ మీదనే ఉన్నాయి. సినిమా నేపథ్యాన్ని తెలియజేసే ఓ పాట లిరికల్ వీడియోలో మాత్రం రానా స్టిల్స్ కూడా చూపించారు.
రానా పోషించిన డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన టీజర్ ని వదిలారు కానీ.. అందులో కూడా భీమ్లా క్యారక్టర్ ని పొగడ్డానికే ఆ పాత్రని పెట్టారనుకునేలా కట్ చేసారు. ఇప్పుడు రిలీజ్ డేట్స్ కాంట్రవర్సీలో కూడా పవన్ సినిమా అంటున్నారే తప్ప.. ఎక్కడా రానా ఊసేలేదు. ఒకవేళ ఇది రీమేక్ కాకపోతే.. పవన్ సినిమాలో రానా కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నాడని అందరూ అనుకునేవారు.. ‘బాహుబలి’ తరహాలోనే ఇందులో రానా పాత్ర ఉంటుందని సర్దుకుపోయేవారు.
కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆల్రెడీ ఎక్కువ మంది చూసిన సినిమా కావడం.. ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలియడం వల్ల మల్టీస్టారర్ నే ఎక్సపెక్ట్ చేస్తారు. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని మార్పులు చేసినా.. రానా పాత్రకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆశించడంలో తప్పులేదు. ప్రస్తుతానికైతే ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి రానా పూర్తిగా సైడ్ అయిపోయినట్లే అనిపిస్తోంది. శనివారం మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారని సమాచారం. మరి అందులో అయినా రానాకు తగిన గుర్తింపు ఉంటుందో లేదో చూడాలి.
‘భీమ్లా నాయక్’ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతం సమకూర్చగా.. రవి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేసారు.