టీడీపీ ‘భీమ్లానాయక్’ని ప్రమోట్ చేస్తే, వైసీపికి వణుకెందుకు.?

‘భీమ్లానాయక్’ సినిమాని దెబ్బకొట్టేందుకు అధికార వైసీపీ అడ్డమైన పనులూ చేసింది. కానీ, ‘భీమ్లానాయక్’ తుపానులో వైసీపీ కుయుక్తులన్నీ కొట్టుకుపోయాయి. సాయంత్రానికి ఓ మంత్రిగారి ప్రెస్ మీట్.. అదీ ‘భీమ్లానాయక్’ సినిమా గురించి.

ఈ స్థాయికి రాష్ట్రంలో వైసీపీ దిగజారిపోయిందా.? లేదంటే, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆ స్థాయికి పెరిగిందా.? గతంలో ఏ సినిమా విషయంలో అయినా, ప్రభుత్వంలో వున్నవారు అధికారికంగా ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి లేదు గనుక, పవన్ కళ్యాణ్ ఈజ్ సమ్‌థింగ్ స్పెషల్.. ఆయన ఇమేజ్, ప్రభుత్వాన్ని నడిపేవారి కంటే చాలా చాలా పెద్దదని నిరూపితమైపోయింది.

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది టీడీపీ నేతలు, ‘భీమ్లానాయక్’ సినిమాకి ప్రమోషన్ల పరంగా అనధికారిక బ్రాండ్ అంబాసిడర్లయిపోయారు.

వాళ్ళ గోల వాళ్ళది.. ఎలాగైనా, ‘భీమ్లానాయక్’ సినిమాకి అదనపు పబ్లిసిటీ తెచ్చి, పవన్ కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకుని, రాజకీయంగా కాస్తో కూస్తో లబ్ది పొందాలని టీడీపీ భావిస్తోంది. సరే, ఆ రాజకీయ లబ్దికి టీడీపీకి చేకూరుతుందా.? అన్నది వేరే చర్చ.

వైసీపీ చేసిందేంటి.? ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల విషయమై ఎలాంటి అడ్డంకులూ సృష్టించి వుండకపోతే, ‘పవర్ తుపాను’ ఈ స్థాయిలో వచ్చి వుండేదే కాదు. ‘భీమ్లానాయక్’ ఓ సినిమా.. పెద్ద సినిమానే కావొచ్చు. విడుదలవుతుంది, కొద్ది రోజుల తర్వాత థియేటర్ల నుంచి మాయమవుతుంది.

కానీ, చరిత్రలో కనీ వినీ ఎరుగని స్థాయిలో థియేటర్ల వద్ద డీజేల మోత, మాస్ మాబ్స్ చిందులు.. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, జనసైనికుల ర్యాలీలు.. ఇదంతా జరిగిందటే, దానికి కారణం వైసీపీ తెలిసో తెలియకో ఇచ్చిన ఫ్రీ పబ్లిసిటీనే.! తెలిసో తెలియకో కాదు.. ‘భీమ్లానాయక్’ని చూసి వణికింది.. ఆ వణుకులో ఇలా ఉచిత పబ్లిసిటీ ఇచ్చేసింది.