బిగ్‌బాస్‌ 4 పై ‘మా’ వర్గాల స్పందన

తెలుగు బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్‌లు పూర్తి అయ్యాయి. అంతా బాగుంటే నాల్గవ సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగేవి. కాని కరోనా కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది. గత ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌ 3 జులై 21న ప్రారంభం అయ్యింది. రెండవ సీజన్‌ 2018 జూన్‌ 10న ప్రారంభం అయ్యింది. మొదటి సీజన్‌ 2017 జులై 16న ప్రారంభం అయ్యింది. అంటే బిగ్‌బాస్‌ ఈసారి కూడా జూన్‌ లేదా జులైలో ప్రారంభం అవ్వాల్సి ఉంది.

బిగ్‌బాస్‌ సీజన్‌ ప్రారంభంకు మూడు నెలల ముందే కసరత్తు ప్రారంభించాల్సి ఉంటుంది. పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం నుండి వారికి ఇవ్వాల్సిన టాస్క్‌లు హోస్ట్‌ సెట్టింగ్‌ రీ డిజైన్‌ ఇలా అన్ని ఏర్పాట్లు ప్రారంభించాల్సి. కాని ఇప్పటి వరకు అందులో ఏ ఒక్కటి ప్రారంభం కాలేదని మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 4 కు సంబందించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కూడా జరపలేదని స్టార్‌ మా ఛానెల్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో నిర్వహణ సాధ్యం కాదు. కాని పరిస్థితులు కుదుట పడిన తర్వాత సీజన్‌ 4 కు సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి వరకు అయినా సీజన్‌ 4ను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సీజన్‌ 4 ను వాయిదా వేశారు. అక్కడ కూడా వచ్చే ఏడాది ఆరంభంలో సీజన్‌ 4ను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.