కొడాలి నానిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ

గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో జరిగిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనీపై మంత్రికి టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని కోరుతూ టీడీపీ నిజనిర్ధరణ కమిటీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందించారు. గుడివాడలో క్యాసినో జరిగిందనేదానికి ఆధారాలు ఉన్నాయంటూ.. కరపత్రాలు, వీడియో సాక్ష్యాలను గవర్నర్ కు అందజేశారు. క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

ఈక్రమంలోనే గుడివాడలో టీడీపీ నేతలపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా గవర్నర్ కు కమిటీ ఫిర్యాదు చేసింది. క్యాసినో జరిగిన తర్వాత 13 మంది యువతులు ఈనెల 17న విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా గోవా వెళ్లిన ఆధారాలను కూడా గవర్నర్ కు కమిటీ అందజేసింది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్ కు అందించారు.