ఏ క్షణమైనా మూడు రాజధానుల ఏర్పాటు: మంత్రి బొత్స

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది ప్రభుత్వ విధానమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరతాం. కోర్టు కేసులు పరిష్కరించుకుంటాం. ఈ ఏడాదని కాదు.. ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు ఉంటుంది. ఇందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయి. శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగి తీరుతుంది. రాష్ట్రంలో సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చు’.

‘రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక. వారిది పైశాచిక ఆనందం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. రాజధాని ఏర్పాటుపై రాజ్యాంగానికి అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పేదలందరూ వినియోగించుకోవాలి. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలూ కల్పిస్తాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.