చంద్రబాబు, నారాయణపై సీఐడీ కేసులు..! ఊరికే అరెస్టు చేస్తారా: బొత్స

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏప్రిల్ 27న సీఐడీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేశారు. లింగమనేని రమేష్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రై. లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌పైనా మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేస్తారని.. పది పరిక్ష పేపర్లు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని అన్నారు. లీకేజీ కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తేలేదని అన్నారు. తప్పు చేయలేదని ఆయా వ్యక్తులు నిరూపించుకోవాలని అన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 60 మందిని అరెస్టు చేశారని.. తప్పు చేయకపోతే ఎందుకు అరెస్టు చేస్తారని మంత్రి ప్రశ్నించారు.