వినయ విధేయ రామ సినిమా వచ్చి దాదాపు ఏడాది మీదా పది నెలలు అయిపోయింది. మరో సినిమా స్టార్ట్ అయినట్లే అయింది కానీ అలా షెడ్ లో వుండిపోయింది. కరోనా వచ్చి లెగ్ బ్రేక్ వేసేసింది. తిరిగి మళ్లీ సెట్ మీదకు ఇప్పట్లో వెళ్లే సూచనలు కూడా కనిపించడం లేదు.
కరోనా నేపథ్యంలో షూటింగ్ లు అన్నీ చకచకా ప్రారంభం అవుతున్నాయి కానీ అరవైల్లో పడిన వారికి ఇంకా అనుమతి లేదు. అందుకే బాలయ్య సెట్ మీదకు రావడం అన్నది కాస్త ఆలస్యం అవుతుంది. దానికి తోడు బోయపాటి సినిమా అంటే స్టార్ కాస్ట్ కాస్త ఎక్కువే వుంటుంది. అందరి కాంబినేషన్ డేట్ లు దొరకడం అంత వీజీ కాదు. ఎందుకంటే టోటల్ గా చాలా సినిమాలు ఒకేసారి సెట్ మీదకు వెళ్తున్నాయి. అందరికీ డేట్ లు కావాలి.
ఇదికాక సినిమాలో ఓపాత్రకు నవీన్ చంద్రను అనుకున్నారు. ఈ విషయం నవీన్ చంద్ర కూడా వెల్లడించాడు. కానీ ఇప్పుడు నవీన్ చంద్రతో వెళ్లాలా? మరెవరినైనా చూడాలా అన్న ఆలోచన కూడా వున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.
ఇలా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు వేస్తుంటే ఇక ఎప్పడు ప్రారంభం అవుతుందో అన్నది అనుమానమే. పైగా ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ లకు, ఇతరత్రా వ్యవహారాలకు పెట్టిన పెట్టుబడికి వడ్డీ తడిసి మోపెడు అవుతున్నట్లు, ఆ భారం అంతా సినిమా మీదే పడుతుందని వినిపిస్తోంది.