సుఖదుఃఖాలు, కష్టనష్టాలనేవి రుతువులు లాంటివని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. అవి వస్తుంటాయ్, పోతుంటాయ్ అని వివరించిన తీరు నేటికీ మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేవే. కానీ సినిమా రంగంలో ఒక దశ దాటిన తర్వాత… ఎంతటి కొమ్ములు తిరిగిన నటుడికైనా పతన దశ మొదలైతే కాపాడ్డం ఎవరి తరం కాదు.
దీనికి నిలువెత్తు నిదర్శనం హాస్య బ్రహ్మ బిరుదాంకితుడు బ్రహ్మానందమే. మాటలతోనే కాదు హావ భావాలతో నవ్వులు పండించిన బ్రహ్మానందానికి టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు దక్కలేదంటే ఆశ్చర్యమే. బహుశా ఇలాంటి బ్యాడ్ డేస్ వస్తాయని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. దీంతో ఆయన గౌరవంగా సినిమాల నుంచి తనకు తానుగా తప్పుకోవాలని యోచిస్తున్నారని సమాచారం.
ఇకపై బుల్లితెరపై బ్రహ్మానందాన్ని పంచాలని ఉవ్విళ్లూరుతున్నారని తెలిసింది. టాలీవుడ్‌లో కొత్త తరం హాస్య నటుల ఎంట్రీతో బ్రహ్మానందానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఒక్క బ్రహ్మానందమే కాదు అలీ లాంటి వాళ్లకు కూడా సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. అందుకే ఆయన హాయిగా బుల్లితెర యాంకర్‌గా సెటిల్ అయ్యారు.
ఈ నేపథ్యంలో బ్రహ్మానందం బుల్లితెరపై కామెడీ ప్రోగ్రామ్స్‌తో పాటు సీరియల్స్‌లో నటించడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఓ డైలీ సీరియల్‌లో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం. తెర ఏదైనా తన పాత్రకు ప్రాధాన్యం ఉండడం, ప్రేక్షకులకు ఎప్పుడూ కనిపించాలనే రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మానందం భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.