చంద్రన్న ఛలో అమరావతి.. పార్టీ శ్రేణుల్లో ఏదీ ఆ ఉత్సాహం.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమరావతికి రానున్నారు. హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి ఈ రోజు ఉదయమే బయల్దేరారాయన అమరావతికి రోడ్డు మార్గం ద్వారా. చంద్రబాబుతోపాటు, లోకేష్‌ కూడా అమరావతికి పయనమయ్యారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ హైద్రాబాద్‌లో ‘లాక్‌’ అయిపోయిన విషయం విదితమే.

నిజానికి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, అమరావతికి వెళ్తానంటే ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. అయితే, ‘చంద్రబాబు గనుక రావాలనుకుంటే, 14 రోజుల క్వారంటైన్‌కి ఒప్పుకోవాల్సిందే..’ అంటూ అధికార పార్టీ చేసిన వ్యాఖ్యలు.. ముఖ్యంగా మంత్రులు చేసిన ప్రకటనలతో చంద్రబాబు, హైద్రాబాద్‌కే గత రెండు నెలలుగా అంకితమైపోయినట్లు తెలుస్తోంది.

నిజానికి హైద్రాబాద్‌ నుంచి విమాన మార్గంలో విశాఖకు వెళ్ళి, విశాఖ గ్యాస్‌ లీక్‌ బాధితుల్ని పరామర్శించి, ఆ తర్వాత అమరావతికి వెళ్ళాలనుకున్నారు చంద్రబాబు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా ఈ రోజు విమానయానానికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తితో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం అలాగే విశాఖకు విమాన సర్వీసులు నడపకూడదని నిర్ణయం తీసుకుంది. దీనిపై టీడీపీ నానా యాగీ చేస్తోందనుకోండి.. అది వేరే విషయం.

దేశంలో చాలా విమానాశ్రయాల్లో ఈ రోజు విమానాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు విమానాల రాకపోకలకు పరిస్థితులు అనుకూలించలేదు.? అన్న అనుమానాలైతే లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం.

ఇదిలా వుంటే, టీడీపీ జూమ్ యాప్‌ ద్వారా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (మహానాడు) నిర్వహించబోతోంది. దీనికోసం భారీస్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయినాగానీ, పార్టీ శ్రేణుల్లో ఎక్కడో పూర్తిస్థాయి నైరాశ్యం కన్పిస్తోంది. అధినేత చంద్రబాబు రెండు నెలలుగా హైద్రాబాద్‌కే పరిమితమవడం పట్ల పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబులో మునుపటి సీరియస్‌నెస్‌ కొరవడిందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది.