“ఈరోజు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడని నేను చెప్పానా..? అలాగే జరిగింది చూడండి. సాయంత్రానికల్లా పడమరకు వచ్చేస్తాడని కూడా చెప్పా కదా.. అదే జరుగుతుంది చూడండి..” కరోనా టైమ్ లో చంద్రబాబు డైలాగ్ లు ఇలానే ఉన్నాయి. తానేదో బ్రహ్మంగారిలా అంతా ముందే ఊహించి చెప్పేస్తున్నట్టు, దాన్ని ప్రభుత్వం యాజిటీజ్ గా ఫాలో అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు.
పచ్చ పత్రికల ఎక్స్ ట్రా కవరేజీ దీనికి అదనం. అదిగో చంద్రన్న అప్పుడు చెబితే కాదన్నారు, ఇదిగో చూడండి ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తోంది అని పోలికలు చూపెడుతూ కథనాలు వండివారుస్తున్నారు. వైద్యులకు పీపీఈ కిట్లు చంద్రన్న చెబితేనే సాధ్యమైందని, మాస్క్ ల పంపిణీ కూడా ఆయన చలవేనని, కరోనా టెస్ట్ ల సంఖ్య పెరగడం కూడా ఆయన సూచనేనని చెప్పుకుంటున్నారు.
2-3 రోజుల తర్వాత ఎలాగూ జరుగుతాయనే పరిస్థితుల్ని ముందే పసిగట్టి.. మీడియాకు చెప్పడం, ప్రభుత్వానికి లేఖ రాయడం.. ఆ తర్వాత కాలానుగుణంగా అవి జరిగినప్పుడు.. అది నా గొప్పతనమేనని చెప్పడం చంద్రబాబుకి పరిపాటిగా మారింది. కొవిడ్ నెగెటివ్ నిర్థారణకు ట్రూనాట్ కిట్లు వాడండి, పరీక్షల సంఖ్య పెంచండి, అవసరమైతే ప్రైవేట్ ల్యాబ్ ల సాయం తీసుకోండి.. అంటూ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాయడం కూడా ఈ గేమ్ లో భాగమే.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు క్షయ వ్యాధి నిర్థారణకు ట్రూనాట్ కిట్లను వాడామని, దీని ద్వారా మంచి ఫలితాలొచ్చాయని రియల్ టైమ్ గవర్నెన్స్ తో అనుసంధానం చేసి మరింత కచ్చితత్వంగా కేసుల సంఖ్య చెప్పొచ్చని ఉచిత సలహా పారేశారు. కరోనా నిర్థారణకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసి, నెగెటివ్ వచ్చిందో లేదో తెలుసుకోడానికి మాత్రం ట్రూనాట్ కిట్లను వాడాలని సూచించారు బాబు.
ట్రూనాట్ కిట్ల ద్వారా కరోనా నిర్థారణ కచ్చితంగా జరగడంలేదన్న అనుమానంతో.. వీటిని కేవలం నెగెటివ్ పరీక్షలకు మాత్రమే వాడాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది. ఇవాలో రేపు అదే నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కూడా.. అప్పుడు బాబు అనుకూల మీడియా మళ్లీ లైన్లోకి వస్తుంది. చంద్రన్న సీఎస్ కి లేఖ రాయబట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, లేకపోతే ఎంతో అనర్థం జరిగిపోయి ఉండేదని చెప్పుకుంటుంది.
కరోనా మొదలైనప్పటి నుంచి చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వ్యవహారం ఇలానే ఉంది. అప్పుడు బ్రహంగారిది కాలజ్ఞానం.. ఇప్పుడు చంద్రంగారిది కరోనా జ్ఞానం. అంతే తేడా..!