చంద్రబాబుకి తెలంగాణ టీడీపీ ఝలక్‌.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయి, ఎలా రాజకీయ జీవితాన్ని ముందుకు నడపాలో తెలియక కిందా మీదా పడుతున్న ‘ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ నారా చంద్రబాబునాయుడికి, తెలంగాణ టీడీపీ నుంచి మరో ఝలక్‌ ఎదురవుతోంది. తెలంగాణ టీడీపీనా.? అదెక్కడుంది.? అని అడగకూడదు. ఎందుకంటే, తెలుగుదేశం అనేది జాతీయ పార్టీ. తెలంగాణలో టీడీపీకి ఎల్‌ రమణ రూపంలో ఓ అధ్యక్షుడున్నాడు. అప్పుడప్పుడూ ‘నేనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని’ అని ఆయన చెప్పుకోవాలి.

‘మేం ఇంకా తెలంగాణలో వున్నాం..’ అని చెప్పుకోడానికి ఆ పార్టీ తరఫున ఒకరిద్దరు నేతలు తెలంగాణలో హడావిడి చేస్తుంటారు. ఇప్పుడు ఆ నేతలే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని కోరుతూ పార్టీ నేతలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఎల్ రమణను మార్చాలని సీనియర్ నేతలు కూడా చంద్రబాబును కోరారు. ఏడేళ్లుగా ఒకరే పార్టీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఎదుగుదల కనిపించడం లేదని వారన్నారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని లేఖ రాయడం గమనార్హం

‘2019 ఎన్నికల ముందు వరకూ ఏపీ రాజకీయాల్లో బిజీగా వుండడం వల్ల తెలంగాణకి సమయం కేటాయించలేకపోతున్నా..’ అని వంక పెట్టేవారు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతల వద్ద. ఇప్పుడు మరి, ఇంకెలాంటి కుంటి సాకులు వెతుక్కుంటారో.!

‘ఆంధ్రప్రదేశ్‌లో ఉద్ధరించేద్దామని, తెలంగాణని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఏపీలోనూ పార్టీ సర్వనాశనమైపోయింది.. తెలంగాణలో టీడీపీని వుంచుతారా.? పీకేస్తారా.?’ అన్న ధోరణిలో చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారట తెలంగాణ టీడీపీ నేతలు. పాపం చంద్రబాబు మాత్రం ఏం చేయగలరు.!

‘హైద్రాబాద్‌ని కట్టింది నేనే..’ అంటూ గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గొంతు చించుకుంటే, అస్సలు టీడీపీని లెక్క చేయలేదు గ్రేటర్‌ ఓటర్లు. ఈసారి ఏ మొహం పెట్టుకుని గ్రేటర్‌ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి వస్తారట.? ఏపీలోనే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల్లోకి దూకేస్తున్నారాయె. వారినే బుజ్జగించుకోలేని దుస్థితి చంద్రబాబుది.

పాపం.. ఈ వయసులో ఇంత కష్టం ఆయనకి అవసరమా.? తప్పదు మరి.! పుత్రరత్నం నారా లోకేష్‌ ఎటూ, పార్టీని పైకి తీసుకొచ్చేంత సీన్‌ లేదు సరికదా.. ‘ఆయన భారం’ కారణంగా టీడీపీ మునిగిపోయిందన్న విమర్శలున్నాయ్‌.. సో, చంద్రబాబే ఓపిక వున్నంత కాలం.. ‘టీడీపీ అక్కడా వుంది.. ఇక్కడా వుంది..’ అని చెప్పుకోవాల్సిందే.