టీడీపీ అను‘కుల’ మీడియాలో ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇకపై రోజువారీ విచారణ’ అంటూ ‘పేద్ధ’ సైజులో కథనాలు దర్శనమిచ్చాయి. వైసీపీ అను‘కుల’ మీడియాలో ‘టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ’ అంటూ కథనాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులపై వున్న క్రిమినల్ కేసుల వ్యవహారంపై చర్చ జోరుగా సాగుతున్న వేళ, అత్యంత వేగవంతమైన విచారణకు సుప్రీం ఆదేశించడం, కేంద్రం కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో.. ఆయా రాజకీయ నాయకులకు ముందు ముందు ‘గడ్డు కాలమే’ అన్న చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత.? అన్నది వేరే చర్చ.
ప్రస్తుతానికైతే, కేసుల విచారణలో వేగం పుంజుకుంది. కానీ, చంద్రబాబు.. వైఎస్ జగన్ మాత్రమేనా.? తెలుగు నాట అక్రమాస్తుల కేసులు కావొచ్చు, ఇతరత్రా కేసులు కావొచ్చు.. ఇంకెంతమందిపై ఇలాంటి రోజువారీ విచారణ లేదా వేగవంతమైన విచారణలు జరగనున్నాయి.? అన్నదానిపై మాత్రం మన మీడియా పెద్దగా ‘ఫోకస్’ పెట్టడంలేదు. ఓ అంచనా ప్రకారం, మెజార్టీ రాజకీయ ప్రముఖులు ఆయా కేసుల విచారణ సందర్భంగా ‘రోజువారీ సమస్యలు’ ఎదుర్కోక తప్పదన్న చర్చ జరుగుతోంది. ‘రాజకీయ నాయకులందరిపైనా కేసులు సత్వర విచారణ జరిగితే, ఇప్పుడున్న కోర్టులు సరిపోవు.. అరెస్టు చేయాల్సి వస్తే ఇప్పుడున్న జైళ్ళు సరిపోవు..’ అంటూ ఓ రాజకీయ విశ్లేషకుడు కొన్నాళ్ళ క్రితం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అధికారంలో వున్నోళ్ళు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలపై ‘కక్ష సాధింపు చర్యలకు’ దిగుతున్నారన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య కుప్పలుగా పేరుకుపోయింది గత కొంతకాలంగా. వాటి బూజు దులిపితే.. కొందరికి క్లీన్ చిట్ రావొచ్చు.. కొందరు అడ్డగోలుగా బుక్కయిపోవచ్చు. ‘మేం కడిగన ముత్యంలా బయటకు వస్తాం..’ అని వైసీపీ, టీడీపీ చెబుతున్నాయి తమ తమ అధినేతల గురించి. అది సాధ్యమేనా.? మిగతా నేతల మాటేమిటి.? సత్వర విచారణకు సంబంధించి అసలు ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి.? ఎందుకంటే, మన తెలుగు మీడియాలో ‘కుల పైత్యం’తో కొట్టుమిట్టాడుతున్న దరిమిలా, ‘అందరూ దొంగలే’ అనుకోవాల్సిందేనేమో.!