ఎయిర్‌పోర్టు డ్రామా తర్వాత ఏంటి చెప్మా.?

అసలేం జరుగుతోంది ఆంధ్రపదేశ్‌లో.? పోలీసు అధికారులు దండం పెట్టి మరీ ఎయిర్‌పోర్ట్‌లో బైటాయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుని బతిమాలుకున్నారు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం, ఎయిర్‌పోర్టులోనే దీక్ష చేస్తున్నారు. మంచినీళ్ళు కూడా తీసుకోలేదట ఉదయం నుంచీ. ఆయన నీరసించిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోపక్క, ఇదంతా హై డ్రామా.. అంటూ కొట్టి పారేస్తోంది అధికార వైసీపీ. ‘గతంలో వైఎస్ జగన్ విషయంలో నువ్వేం చేశావ్ చంద్రబాబూ.?’ అంటూ బాహాటంగానే వైసీపీ నేతలు ప్రశ్నించడం చూస్తోంటే, ఇదేదో కక్ష సాధింపు చర్యలా వుంది తప్ప.. ఈ విషయంలో చంద్రబాబు తప్పేం లేదన్న భావన కలుగుతోంది చాలామందిలో.

మొదటినుంచీ వైసీపీ – టీడీపీ మధ్య ‘60-40’ ఒప్పందాలు నడుస్తున్నాయన్న విమర్శలున్నాయి. అందుకు తగ్గట్టే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళితే, అప్పుడూ పోలీసుల అత్యుత్సాహం కారణంగా హైడ్రామా చోటు చేసుకుంది. కోర్టు నుంచి చీవాట్లు పడ్డాయి అధికారులకి అప్పట్లో. నిజానికి, ఆ సమయంలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకోకపోయి వుంటే అంత డ్రామా నడిచేదే కాదు. ఇప్పుడూ అదే జరుగుతోందా.?

కక్ష పూరిత రాజకీయం సంగతి పక్కన పెడితే.. చంద్రబాబుకి జాకీలేసి పైకి లేపేందుకే ఈ డ్రామా నడుస్తోందా.? అన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి. చంద్రబాబు, చిత్తూరు పర్యటనకు వెళితే ఏం జరుగుతుంది.? అంత భయానక పరిస్థితుల్ని సృష్టించే దిశగా చంద్రబాబు తన టూర్‌ని ప్లాన్ చేశారని ఎవరైనా ఎలా అనగలరు.?

ఏమో, ఏం జరుగుతుందోగానీ.. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్న అభిప్రాయమైతే జన బాహుళ్యంలో గట్టిగానే వినిపిస్తోంది. ఇక్కడితో ఈ డ్రామా ముగుస్తుందా.? ముగిస్తే, తదుపరి డ్రామా ఎలా వుంటుంది.? అసలు 60-40 ఒప్పందాల్లో భాగంగా తదుపరి సీన్ ఏంటి.? ఇప్పుడీ అంశం చుట్టూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్ జరుగుతుండడం కొసమెరుపు.