పథకాలకు ఎన్టీఆర్ పేరు తీసేసి.. జిల్లాకు పేరు పెట్టి గొప్పలా..?: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నారని.. ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ 14 పథకాలు తీసుకొస్తే.. వాటి పేర్లు తీసేసిన జగన్ ప్రభుత్వం.. జిల్లాకు ఆయన పేరు పెట్టి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్​లు, ముఖ్య నేతలతో నిర్వహించిన ఆన్​లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అక్రమాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు. క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో.. పార్టీ నేతలు బాగా పని చేశారన్నారు.

విద్యుత్ చార్జీలు, పన్నులు పెంచేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని మండిపడ్డారు. మార్చి నాటికి టీడీపీ ఆవిర్భావానికి 40 ఏళ్లు పూర్తి, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మహానాడు, కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.