వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల్ని బతకనివ్వరు: చంద్రబాబు

కల్తీసారా కారణంగా జంగారెడ్డిగూడెంలో మరణాలు సంభవిస్తే.. సహజ మరణాలని సాక్షాత్తూ సీఎం చెప్పడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆర్యవైశ్యులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పాలన, సీఎంను తన రాజకీయ జీవితంలో చూడలేదని అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరినీ బతకనివ్వదని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో రౌడీ పాలన జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలను విమర్శించినా కేసులు పెడుతున్నారని అన్నారు. నలుగురికి సేవ చేసే ఆర్యవైశ్యులంటే ప్రభుత్వానికి చులకనగా ఉందని అన్నారు. వ్యాపారులను వేధిస్తూ.. వసూళ్లకు పాల్పడటంతోపాటు జే ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తోందని అన్నారు.

రాజకీయంలో ఉన్నత స్థానానికి ఎదిగిన రోశయ్యకు నివాళులు అర్పించడానికి సీఎంకు మనసు రాకపోవడం శోచనీయమన్నారు. తాము అధికారంలోకి వస్తే రోశయ్యను తగిన రీతిలో గౌరవిస్తామన్నారు. రోశయ్యను గౌరవించేలా ప్రభుత్వ సంస్థకో, కార్యక్రమానికో ప్రభుత్వం ఎందుకు పేరు పెట్టలేదని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు.