స్వర్గీయ నందమూరి తారకరామారావు.. నో డౌట్, హీ ఈజ్ ఎ లెజెండ్.! సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారాయన. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఢిల్లీ స్థాయిలో తెలుగు వాణిని గట్టిగా వినిపించిన నాయకుడాయన. ఢిల్లీ నాయకత్వం, తెలుగు నేల గురించి గట్టిగా ఆలోచించేలా చేసిన ఘనత అప్పట్లో ఎన్టీయార్‌కే దక్కింది. సినీ రంగంలో ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.?
కానీ, తెలుగు ఆత్మగౌరవం అంటేనే ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ అంటే ఎలా.? ఇది ఓ రకంగా చాలామంది మహనీయుల్ని అవమానించినట్లు లెక్క. ఎందుకంటే, గురజాడ అప్పారావు, పింగళి వెంకయ్య.. చెప్పుకుంటూ పోతే, బోల్డంతమంది మహనీయులు, తెలుగు నేల కోసం ఎంతో సేవ చేశారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నేలకు గుర్తింపు తెచ్చిన మహనీయులు ఎందరో వున్నారు.
స్వర్గీయ ఎన్టీయార్ నిజానికి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీకే ‘ఆత్మగౌరవం’ కాదు. ఔను, ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే స్వయంగా తన మామ స్వర్గీయ నందమూరి తారకరామారావుని పార్టీ నుంచి బయటకు పంపేశారు. కాదు కాదు, పార్టీలోకి చొరబడి, ఎన్టీయార్‌కి రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు.
ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామారావుని అభిమానించి, ఆయన అడుగుజాడల్లో నడిచి, నేటికీ ఆయన్ని గౌరవించేవారెవరైనా ‘ఎన్టీయార్.. తెలుగు జాతి ఆత్మగౌరవం..’ అంటే అదొక లెక్క. కానీ, ఆ ఎన్టీయార్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని అభిమానించే నేటితరం టీడీపీ నేతలు, ‘తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీయార్’ అంటే, వినడానికి ఒకింత ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని రాజకీయ అవసరాల కోసం 2009 ఎన్నికల ప్రచారంలో వాడుకుని వదిలేసిన ఘనుడు చంద్రబాబు. అంతేనా, స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు, చైతన్య రధ సారధి హరికృష్ణ విషయంలో చంద్రబాబు చేసిన రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
నందమూరి బాలకృష్ణను ఎమ్మెల్యే పదవికి పరిమితం చేసి, పార్టీ రాజకీయాల వైపు చూడకుండా చేసిన ఘనుడు చంద్రబాబు కాక ఇంకెవరు.?
ఇన్ని ఘనతలు చంద్రబాబు పక్కన పెట్టుకుని, చంద్రబాబుని కీర్తిస్తూ.. స్వర్గీయ ఎన్టీయార్ తెలుగు జాతి ఆత్మగౌరవమని నినదిస్తే ఎలా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి డాష్ డాష్.!