అసెంబ్లీలో బాబు టాప్‌…జ‌గ‌న్ నెక్ట్స్‌

నవ్యాంధ్రప్రదేశ్‌లో జ‌రిగిన మొట్ట‌మొద‌టి అసెంబ్లీ స‌మావేశాలు 14 రోజుల పాటు హాట్‌ హాట్‌గా సాగి నేడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ చివ‌రి రోజున ఎవ‌రెంత స‌మ‌యం మాట్లాడార‌నే గ‌ణంకాలు విడుద‌ల చేశారు. య‌థాప్ర‌కారం ప్ర‌సంగం అంటే తెగ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించే టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టాప్‌లో నిలిచారు. అత్యధికంగా చంద్రబాబు 8 గంటల 19 నిమిషాలు సభలో మాట్లాడగా…ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 3 గంటల 46 నిమిషాల పాటు సభలో మాట్లాడారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో మొత్తం 42 మంది సభ్యుల ప్రసంగించారు.

అధికారిక లెక్క‌ల ప్ర‌కారం సభ మొత్తం 57 గంటల 56 నిమిషాల పాటు కొనసాగింది. ఇక సమయం విషయానికి వస్తే అధికార టీడీపీ 42 గంటల 09 నిమిషాలు సమయం తీసుకోగా ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి అందులో మూడో వంతు స‌మ‌యం కూడా ద‌క్కలేదు. కేవ‌లం 12 గంటల సమయం వైసీపీ తీసుకుంది. అధికార పార్టీ మిత్ర‌ప‌క్ష‌మై బీజేపీకి 3 గంటల 32 నిమిషాల సమయం తీసుకుంది. ఇండిపెండెంట్లకు 14 నిమిషాల టైం ఇచ్చారు. ఇక  టీడీపీ సభ్యులు నాలుగు నిమిషాలు సభా సమయం వృథా చేయగా,  వైఎస్‌ఆర్సీ సభ్యులు 49 నిమిషాలు సభా బిజినెస్‌ను జరగనివ్వలేదు.

కాగా, ఈ స‌మావేశాల్లో 43 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వగా 25 ప్రశ్నలకు సమాధానాలను  ప్రభుత్వం సభ ముందు పెట్టింది. స్వల్పకాలిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వ‌డంతో పాటుగా మూడు తీర్మానాలకు సభ ఆమోదించగా… 344 రూల్ కింద 2 అంశాలపై చర్చ జరిగింది. మూడు అంశాలపై మంత్రులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు.