పీవోకే లో చైనాకు వ్యతిరేకంగా భారీ నిరసనలు!


పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా కు వ్యతిరేకంగా ఆందోళనలు జోరందుకున్నాయి. చైనా ప్రభుత్వం అక్కడ చేపట్టనున్న ప్రాజెక్టులకి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి ముజఫరాబాద్ లో భారీ నిరసన ప్రదర్శన చేసారు. చైనా-పాక్ ఆర్థిక కారిడార్ నీలం-జీలం నదులపై జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఆ రెండు దేశాల మధ్య జూన్ లో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పీవోకే లో ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముజఫరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ‘నదిని కాపాడుకుందాం.. ముజఫరాబాద్ ను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. చైనాపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ .. చైనా జాతీయ జెండాలను తగులబెట్టారు.
గతంలో స్వచ్ఛమైన నీళ్లతో పరవళ్లు తొక్కే నీలం-జీలం నది ఇప్పుడు మురుగునీటి కాలువగా మారిందని పీవోకేకు చెందిన సామాజికవేత్త డాక్టర్ అమ్జాద్ మీర్జా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల తాగునీటి అవసరాలు తీరడం లేదని తెలిపారు. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో ఆ దేశ కంపెనీలు పీవోకే లోని సహజ వనరులను కొల్లగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. డ్యాముల నిర్మాణం కోసం చైనా కంపెనీలు నదిని మళ్లించడంతో మజఫరాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇదంతా ఎవరు చెల్లిస్తారు ఈ భారమంతా పీవోకే ప్రజలపైనే పడుతుంది. దీంతో ఇక్కడి ప్రజలు మరింతగా పేదరికంలో కూరుకుపోతారు. పీవోకే ప్రజలు ఎన్ని నిరసనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అని అమ్జాద్ మీర్జా ఆందోళన వ్యక్తం చేశారు.