చిరంజీవి పరువు పాయే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య గత కొన్ని నెలలుగా ఉన్న కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి తనవంతు ప్రయత్నం చేసారు. ఇండస్ట్రీ బిడ్డనని చెప్తూనే ‘పెద్ద’గా సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేశారు. సినీ ఇండస్ట్రీ గురించి ఇప్పటికే ఒకసారి సీఎం జగన్ తో మాట్లాడి వచ్చిన చిరు.. నిన్న గురువారం మరికొందరు సినీ ప్రముఖులతో కలిసి వెళ్లి చర్చించారు.

ఈసారి చిరంజీవి వెంట మహేష్ బాబు – ప్రభాస్ – రాజమౌళి – కొరటాల శివ – నిరంజన్ రెడ్డి వంటి టాలీవుడ్ పెద్దలు ఉన్నారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంలో చర్చలు సానుకూలంగా జరిగాయని.. అన్నిటికి శుభం కార్డు పడుతుందని చెప్పారు. ఈ నెలాఖరులోపు అందరికీ ఆమోదయోగ్యమైన అధికారిక ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

సినీ నిర్మాతలకు నష్టం లేకుండా ప్రజలకు భారం కాకుండా అందరికీ న్యాయంగా ఉండేలా టికెట్ ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పెద్ద సినిమాలతో పాటుగా చిన్న మీడియం రేంజ్ చిత్రాలకు కూడా ఐదో షోకి అనుమతిస్తాం అని.. రెమ్యూనరేషన్స్ ని పక్కనపెట్టి భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామని ప్రకటించారు. నిన్న సీఎం – సినీ ప్రముఖులకు మధ్య జరిగిన భేటీకి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి గత ఆరేడు నెలలుగా చిరంజీవి చాలా కష్టపడినట్లు మహేష్ – ప్రభాస్ – రాజమౌళి చెప్పారు.. సీఎంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని కూడా చిరుని కొనియాడారు. మొత్తం మీద జగన్ సర్కారు ఇండస్ట్రీకి సానుకూలమైన జీవో రిలీజ్ చేస్తే మాత్రం.. ఆ క్రెడిట్ అంతా మెగాస్టార్ కి దక్కుతుందనే విధంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో చిరంజీవి పై ట్రోల్స్ – సెటైర్స్ కూడా వస్తుండటం గమనార్హం.

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ పై సెటైరికల్ ట్వీట్స్ చేసారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల ఇష్యూపై గతంలో అనేక ట్వీట్లు పెట్టిన ఆర్జీవీ.. ఇప్పుడు సినీ పెద్దల మీటింగ్ నుఉద్దేశిస్తూ చిరంజీవిని టార్గెట్ చేసారు. ‘ఓ మెగా ఫ్యాన్ గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డా’ అని ట్వీట్ చేశారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలా బెగ్ చెయ్యడని.. అందుకే అతను చిరు కంటే ఎక్కువ పాపులర్ అంటూ సెటైర్లు గుప్పించారు.

ఇలాంటి విషయాల వల్లే చిరంజీవిని మెగా ఫ్యాన్స్ ఇష్టపడరంటూ ట్వీట్ చేసాడు వర్మ. వీటికి మెగాస్టార్ ని కూడా ట్యాగ్ చేసారు. కొద్దిసేపటి తర్వాత ఆర్జీవీ ఆ ట్వీట్లను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే అవి వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు – జనసేన ఫాలోవర్స్ సైతం చిరు తీరుపై ట్రోల్స్ చేస్తున్నారు. అలానే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే సీఎం జగన్ తో సమావేశమైంది స్వప్రయోజనాలకంటూ వరుస కథనాలు ప్రచారం చేస్తూ వస్తోంది. వైజాగ్ లో స్టూడియో నిర్మాణం కోసం 100 ఎకరాల స్థలం కేటాయింపుల కోసమే చిరు ప్రయత్నమని చెబుతున్నారు.

మరోవైపు సీఎంతో భేటీలో పెద్ద సినిమాల గురించి అసలు డిస్కస్ చేయకుండా.. ఏదో జనరల్ జీవో మీద చర్చించారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలానే నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీకి సేవలు చేస్తున్న వ్యక్తి ఇలా చేతులు జోడించి అభ్యర్థించడం.. బయటకు వచ్చి ధన్యవాదాల కార్యక్రమం పెట్టడం ఏంటని పీకే ఫ్యాన్స్ అంటున్నారు. టాలీవుడ్ కోసం చిరంజీవి ఇదంతా చేస్తున్నప్పటికీ.. ఈ వ్యవహారం వల్ల మెగాస్టార్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. అందరితో సెటైర్లు ట్రోలింగ్ చేయించుకోవాల్సి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.