మెగాస్టార్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తారా..?

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి.. బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించారు. ఇప్పుడు నాలుగైదు సినిమాతో బిజీగా ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యంగ్ హీరోల కంటే రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడిగా మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తానని చిరు అంటున్నారు.

చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మెగా తండ్రీకొడుకులు – కొరటాల కలిసి డైరెక్టర్ హరీష్ శంకర్ తో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూను మేకర్స్ సోషల్ మీడియాలో వదిలారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని తొమ్మిదేళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం.. తిరిగి సినిమాల్లోకి వచ్చాక సీరియస్ సబ్జెక్ట్లు చేయడం వల్ల నేను నవ్వడం మర్చిపోయా.. నాలో హాస్యగ్రంథులు చచ్చిపోయాయా? అని అప్పుడప్పుడూ నాకే అనుమానం వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ‘దొంగ మొగుడు’ – ‘రౌడీ అల్లుడు’ లాంటి స్క్రిప్టులు వస్తే తప్పకుండా మళ్లీ నా విశ్వరూపం చూపిస్తా. అలాంటి కథలు హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తే తప్పకుండా నటిస్తా” అని అన్నారు.

పాత్ర పరిధి మేరకు మనం వందశాతం నటించగలిగితే తప్పకుండా అందరూ ప్రశంసిస్తారని ‘పునాది రాళ్లు’ సినిమా టైంలోనే అర్ధమైందని చిరు తెలిపారు. చరణ్ తో కలిసి నటిస్తే చూడాలనేది తన భార్య సురేఖ కోరిక అని.. రాజకీయాల్లోకి వెళ్ళడంతో తామిద్దరం కలిసి నటించే ఛాన్స్ లేదని తొమ్మిదేళ్లు బాధ పడిందని.. ఇన్నాళ్లకు ఆమె కల నెరవేరిందని చెప్పారు.

‘ఆచార్య’ సినిమాలో ఓ సీన్ లో చరణ్ నటన చూసి నేను నిజంగానే భావోద్వేగానికి గురయ్యా. చరణ్ ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నా. ఆ క్షణం మా ఇద్దరికీ కన్నీళ్లు వచ్చేశాయి. ఆ సన్నివేశంలో మేమిద్దరం గ్లిజరిన్ లేకుండానే కన్నీరు పెట్టుకున్నాం. తెరపై ఈ సీన్ చూసినప్పుడు ఎంతటి కఠినాత్ముడైనా కన్నీళ్లు పెట్టుకోక తప్పదు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

చిరంజీవి – చరణ్ – పవన్ కల్యాణ్ కాంబో కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ‘ఆచార్య’ సినిమా ఆ కాంబోలో నాంది అవుతుందని తాను భావిస్తున్నానని మెగాస్టార్ అన్నారు. పవన్ తో హరీష్ శంకర్ చేస్తున్న ‘భవధీయుడు భగత్ సింగ్’ సినిమాలో అవకాశం ఉంటే తప్పకుండా తానూ చరణ్ నటిస్తామని చిరు అన్నారు.

ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రానికి అధికారిక రీమేక్. అలానే మెహర్ రమేశ్ తో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఇది తమిళ్ ‘వేదాలమ్’ కు రీమేక్ అనే సంగతి తెలిసిందే.

ఇక చిరు – డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) కాంబినేషన్ లో ‘Chiru154’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇదే క్రమంలో మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ గా చెప్పబడే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి.. ఈ సినిమాలతో మళ్లీ తన నట విశ్వరూపాన్ని చూపిస్తారేమో చూడాలి.