మరోసారి బిబి స్టేజ్‌ పై మెగాస్టార్‌

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ ఆదివారం ఫినాలే ఎపిసోడ్‌ ప్రసారం కాబోతుంది. ఫినాలే ఎపిసోడ్‌ కు ప్రత్యేక గెస్ట్ గా రాబోతున్నది ఎవరు అంటూ గత రెండు వారాలుగా మీడియా వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత సీజన్‌ కు చిరంజీవి గెస్ట్‌ గా వచ్చి రాహుల్‌ సిప్లిగంజ్ ను విజేతగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు మరో గెస్ట్‌ వచ్చే అవకాశం ఉందని భావించారు. కాని చిరంజీవి కంటె బెస్ట్ మరెవ్వరు ఉండరని ఆయన్నే మళ్లీ ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే చిరంజీవి బిబి 4 ఫైనల్‌ వీక్‌ లో గెస్ట్‌ గా కనిపించేందుకు ఒప్పుకున్నారట. ఆచార్య సినిమా షూటింగ్‌ లో ఉన్నా కూడా కొంత సమయం కేటాయించేందుకు సిద్దం అంటూ ప్రకటించారట. దాంతో షో కు మరింత స్టార్‌ డం రావడంతో పాటు షో మరింత కలర్‌ ఫుల్‌ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు ఎన్టీఆర్‌ ను కోరుకున్నప్పటికి ఆయన జెమినిటీవీతో ఒప్పందంలో ఉన్న కారణంగా రాలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్‌ లో ఉన్న టాప్‌ 5 లో అభిజిత్‌ విన్నర్‌ అయ్యే అవకాశం ఉందని ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్‌ ట్రోఫీ అందుకోబోతున్నట్లుగా అప్పుడే అభిమానులు ప్రచారం చేస్తున్నారు.