మ‌నిషి దురాశే క‌రోనా పుట్టుక‌కు కార‌ణంః చిరు

మెగాస్టార్ చిరంజీవి కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైన వ్య‌క్తి కాదు. ఆయ‌న‌లో సేవ‌కుడున్నాడు. సామాజిక‌, రాజ‌కీయ ప‌రిణామాల‌పై విశ్లేషించ‌గ‌ల జ్ఞాని ఉన్నాడు. క‌ష్ట కాలంలో స‌మాజానికి అండ‌గా నిల‌బ‌డాల‌న్న బాధ్య‌త గ‌ల పౌరుడున్నాడు. అందుకే త‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల‌ను ఆదుకునేందుకు క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసి, విరాళాలు సేక‌రిస్తూ పేద కార్మికుల క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు…రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న మెగాస్టార్ త‌న మ‌నోగ‌తాన్ని ఓ ప్ర‌ముఖ ప‌త్రిక‌తో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

మ‌నిషి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి ప్ర‌కృతిలో వ‌న‌రులున్నాయే త‌ప్ప దురాశ కోసం కాద‌ని మ‌హాత్మాగాంధీజీ ఏనాడో చెప్పారు. ఇపుడు ఆయ‌న మాట‌ల‌కు మ‌ద్ద‌తుగా మెగాస్టార్ కూడా త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించారు. “దురాశ‌తో ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నాం. అదే ఒక్కోసారి మాన‌వాళి వినాశ‌నానికి దారి తీస్తోంది. మాన‌వాళిని హెచ్చ‌రించేందుకే క‌రోనా వైర‌స్‌లాంటివి పుట్చుకొచ్చాయ‌నే అనుమానం క‌లుగుతోంది. ఇది మాన‌వాళికి ప్ర‌కృతి చేస్తున్న హెచ్చ‌రిక‌. ప్ర‌తి మ‌నిషి త‌న అవ‌స‌రాలు తీర్చుకోవాలి. అంతే త‌ప్ప అత్యాశ‌కు పోయి వ‌న‌రుల్ని నాశ‌నం చేసి ముందు త‌రాలకి ఏమీ మిగ‌ల‌కుండా చేయ‌కూడ‌దు” అని చిరు చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్ పుణ్య‌మా అని మాన‌వ సంబంధాల విలువ తెలిసొచ్చింద‌న్నారు. మ‌న జీవన విధానాల్ని స‌రికొత్త‌గా మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే ఇలాంటి క‌ష్ట‌కాలం వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌న్నారు. తెలుగు చిత్ర రంగంలో రోజువారీ వేత‌నంతో ప‌నిచేసే వాళ్లు 14 వేల మంది ఉన్నార‌ని చిరు చెప్పుకొచ్చారు. వీళ్ల‌ను ఆదుకునేందుకు ముందుగా రూ.కోటి విరాళం అందించాన‌న్నారు. ఆ త‌ర్వాత మిత్రుడు నాగార్జున ,ఇత‌ర న‌టీన‌టులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ముందుకు రావ‌డంతో కార్మికుల‌ను ఆదుకునేందుకు వీలైంద‌న్నారు. అయితే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పూర్వ వైభ‌వం త‌ప్ప‌క వ‌స్తుంద‌న్నారు.

ఆచార్య సినిమా ప్రేక్ష‌కుల‌కి కొత్త అనుభూతిని, చ‌క్క‌ని భావోద్వేగాల్ని త‌ప్ప‌క పంచుతుంద‌ని చిరంజీవి తెలిపారు. అయితే ఈ సినిమాలో మ‌రో హీరో పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ లేదా మ‌హేశ్‌బాబుల‌లో ఎవ‌రు న‌టిస్తున్నార‌నే ప్ర‌శ్న‌కు మాత్రం ఆయ‌న న‌వ్వుతూ స‌మాధానం దాట వేశారు. జూన్‌, జూలై మాసాల్లో సినిమా షూటింగ్‌లు మొద‌ల‌వుతాయ‌నే ఆశాభావాన్ని చిరంజీవి వ్య‌క్తం చేశారు. అయితే థియేట‌ర్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు మాత్రం మ‌రికొన్ని నెల‌లు ప‌ట్టొచ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.