చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా చిరంజీవి చేస్తున్న బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ సేవలు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలిసిన విషయమే. ఎంతోమందికి వీటి ద్వారా సేవలు అందుతున్నాయి. ఇప్పుడు మరో ఉదాత్తమైన కార్యక్రమానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా ముందుకొచ్చారు చిరంజీవి. కరోనా బారిన పడిన రోగులకు ‘ఉచిత ప్లాస్మా’ అందించేందుకు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తామని చెప్పారు చిరంజీవి.
కరోనా సోకి కోలుకున్న వారు ఫ్లాస్మా దానం చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా మరికొంతమంది కరోనా సోకిన వారికి ఆయుష్షు పోసినట్టవుతుందని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రచారం చేశారు కూడా. ఈ నేపధ్యంలో కరోనా సోకిన పేదలకు ఉచితంగా ఫ్లాస్మా వితరణ చేస్తామని చారిటబుల్ ట్రస్ట్ తెలిపింది. తెల్ల రేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి ఓ ప్రకటనలో కోరారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని అన్నారు చిరంజీవి.
1998లో చిరంజీవి తన సొంత నిధులతో ప్రారంభించిన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్ 2తో 22 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇన్నేళ్లలో ఎంతో మందికి రక్తం దానం, నేత్ర దానం చేసింది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. కరోనా విపత్కర సమయంలో సీసీసీ ద్వారా సినీ కార్మికులకు అందించిన నిత్యావసరాలు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే అందించారు. ఇవే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు చిరంజీవి.