సినిమా రంగాన్ని ఓన్ చేసుకునేవారు వుంటారు. సినిమా రంగం తనంతట తాను ఒఢిలోకి తీసుకునేవారు వుంటారు. కానీ ఈ రెండూ క్వాలిటీలు ఒకరిలో అరుదుగా వుంటాయి. తన కష్టంతో, ఒక్కో మెట్టు ఎక్కి, ఎదిగి, ఒదిగా, తెలుగు సినిమా రంగం తనది అన్నంతగా మహా వృక్షమై పెరిగారు. ఆయన ఎదిగిన తీరు చూసి, ఆయన ఒదిగిన వైనం చూసి, ఆయన బలం, ఆయన బలగం చూసి సినిమా పరిశ్రమ ఆయనను మెగాస్టార్ గా అంగీకరించింది. ఆయన మార్గంలో పయనించడానికి అస్సలు మొహమాట పడలేదు.
అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఈ కరోనా టైమ్ లో ఏం చేస్తున్నారు. కాస్సేపు ఆయనతో ముచ్చటిస్తే…ఈ ఆలోచనకు ఆయన వెంటనే సై అన్నారు. సుమారు గంటకు పైగా మా టీమ్ తొ ఎక్స్ క్లూజివ్ గా మనసు విప్పి మాట్లాడారు. ఏం సినిమాలు చేస్తున్నారు. ఏం సినిమాలు చేయబోతున్నారు. ఆ ముచ్చట్లేమిటి? ఇక్కడ లేవు. అసలు మెగాస్టార్ తో ఆయన సినిమాల ప్రస్తావన లేని ఇంటర్వ్యూ ఇది. సినిమా సంగతుల కోసం కాదు, మెగా ముచ్చట్ల కోసం చదవండి..
-సర్ నమస్కారం
బాగున్నారా..
-బాగున్నా అండీ. గత కొన్నాళ్లుగా మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అంటే మీ లుక్ అని కాదు. ట్విట్టర్ లో మీ యాక్టివిటీ, సిసిసి వ్యవహారాలు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అర్జున్ సురవరం, ఓ పిట్ట కథ లాంటి సినిమా ఫంక్షన్ లకు వెళ్లి, మాట్లాడిన వైనం చూస్తుంటే..
ఏమో అండీ, అయి వుండొచ్చు. మనలో కూడా పరిణితి వస్తుంది. మన దృక్కోణం కానీ, ఆలోచన కానీ, వైశాల్యం కానీ పెరుగుతూ వుంటుంది అనిపిస్తుంది. అదే మీకు అలా అనిపించిందేమో?
-కరోనా టైమ్ ను ఎలా గడుపుతున్నారు.
పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాను. బయటకు అడగుపెట్టి నెల రోజులు దాటిపోతోంది. మధ్యలో ఓసారి మాత్రం మా పిల్లలు, మనవరాళ్లని తీసుకుని, అలాగే సోషల్ డిస్టెన్స్ ను మెయింటెయిన్ చేస్తూనే వచ్చి వెళ్లారు.
-మనవరాళ్లతో కూడా సోషల్ డిస్టాన్స్ యేనా?
తప్పని సరి అయిపోతోందండీ. అమ్మాయి, పిల్లలు వచ్చారు. మనవరాళ్లను చూడగానే దగ్గరకు తీసుకోవాలని అనిపించింది. తాతగా వాళ్లను గుండెలకు హత్తుకోవాలని అనిపించింది. కానీ కరోనా కారణంగా ఎవరికి వారు దూరంగా వుండాలన్న సలహాలు గుర్తుకు వచ్చి, నా ఇష్టాన్ని, అభిమానాన్ని బలవంతంగా ఆపుకున్నాను. ఆ క్షణం ఎంత బాదపడ్డానో…అప్పుడు మా అమ్మాయి చెప్పింది. నాన్నా, మీరు వన్ మంత్ గా ఇంట్లోనే వుంటున్నారు. మేము ఇంట్లోనే వుంటున్నాం. పిల్లలకు ఏమీ కాదు. వర్రీ కావద్దు అని. అప్పుడు మనవరాళ్లను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాను.
-నేచుర్ ను వాచ్ చేస్తూ ఓ విడియో పెట్టారు
అది మాత్రం బ్యూటిఫుల్ అండీ. ఎర్లీ మార్నింగ్ లేచిపోతున్నాము. ఆ సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేస్తున్నాము.
-మీ విడియోలు చూస్తుంటే మీ కొత్త ఇల్లు ఎప్పుడు చూస్తామా అనిపిస్తోంది.
రావాలి అండీ. నేను మంచి ఆతిథ్యం ఇస్తాను. నేను మంచి హోస్ట్ ను. 13 నుంచి 14 ఏళ్లు వున్న తరువాత మారుద్దాం అనిపించి, నాలుగేళ్లు వేరే ఇంట్లో వుండి చేయించాం.
-ప్లానింగ్ అంతా ఎవరిది?
సురేఖే అండీ. ఎవ్వరూ ఇన్ వాల్వ్ కాలేదు. నేను, చరణ్, కోడలు అందరూ ఎవరి వ్యాపకాల్లో వారు బిజీగా వున్నాం. అందుకే సురేఖ నే చూసుకుంది. కొలోనియన్ స్టయిల్ లో నిర్మించాం. వుండాల్సిన వాడు బాబు. వాడికి నచ్చాలి. నాకేముంది, ఓ గది ఇస్తే చాలు. అందుకే వాళ్లందరికీ నచ్చేలా చేసాం.
-కోడలు వచ్చిన తరువాత మీ కుటుంబంలో లేదా మీలో ఏమైనా మార్పు.సోషల్ గేదరింగ్ లో కానీ, ఇంకేవిధంగా కానీ.
లేదండీ..నేను కానీ, చరణ్ కానీ కాస్త ఎక్కువగానే అందరితో కలిసి మూవ్ అవుతాం. సరిగ్గా చెప్పాలంటే, నా కేరీర్ బిగినింగ్ లో నేను ఎఎన్నార్, ఎన్టీఆర్, శోభన్, కృష్ణ లను చూసాను. ఒకరి దగ్గరకు ఒకరు వెళ్లడం, ఒకరిని ఒకరు కలవడం వంటివి చూసాను. దాని ద్వారా ఫ్యాన్స్ కు ఓమంచి మెసేజ్ ఇవ్వడం అన్నది గమనించాను. . అలా హీరోలు అందరూ కలవడం ద్వారా, సినిమా వాళ్ల మీద జనాల్లో ఓ చీప్ భావం ఏర్పడకూడదు.
ముందు మనం కలిసి వుంటే కింద వరకు మెసేజ్ వెళ్తుంది ఫ్యాన్స్ కూడా కలిసి వుంటారు.పోస్టర్ల మీద పేడముద్దలు పడవు అని అనుకునేవాడిని. అని నేను కూడా నమ్మాను. అందుకే అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, మురళీ మోహన్ ఇలా వీరందరీని కలిసే వాడిని. అప్పట్లో నాకు చెన్నయ్ లోని వేలంచెర్రి, గిండీ దగ్గర ఒక ఎకరా ప్లేస్ లో ఓ ఇల్లు వుండేది. హనీ హవుస్ అనిపేరు. అక్కడ తరచు కలుసుకునేవాళ్లం. భారతీ రాజా, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య గారు. ఇలా అందరూ వచ్చేవారు.
అక్కడ అసలు పార్టీ కల్చర్ అన్నది స్టార్ట్ చేసింది, ఓ షాంపెయిన్ బాటిల్ బ్రేక్ చేసి, అలా అందరికీ సర్వ్ చేయడం, అలాగే వందరోజల పండగులు జరిగినపుడల్లా అక్కడ పార్టీలు ఇవ్వడం ఇవన్నీ ఎప్పటి నుంచో అలవాటు వుంది. తెలుగు దర్శకులు, రచయితలు ఒకటేమిటి అందరినీ ఆహ్వానించేవాడిని. అప్పటికి మీరు చిన్నవాళ్లు అయి వుంటారు.
-ఇప్పటికీ మీరు ఆ జనరేషన్ పీపుల్ తో అదే అసోసియేషన్ కంటిన్యూ చేస్తున్నట్లున్నారు.
ఎగ్జాట్లీ. మనం చూపించే ఆప్యాయతలో, సిన్సియారిటీ, ప్యూరిటీ వుంటే అవతలి వాళ్లు ఎలాంటి వాళ్లయినా మన వాళ్లు అవుతారు. ఇప్పటికీ అందరితో అప్పుడప్పుడు మాట్లాడుతూనే వుంటాను. మనం కోట్లు సంపాదించవచ్చు. వుండొచ్చు. పోవచ్చు. కానీ మనుషుల్ని సంపాదించుకున్న తరువాత వారి ప్రేమను అలా నిలబెట్టుకోవాలి. అందుకే ఓసారి నా దరిచేరిన వాళ్లను ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే వుంటారు. ఇష్టపడుతూనే వుంటాను. విబేధాలు వచ్చిన వాళ్లు చాలా తక్కువ మంది. ఒక వేళ వచ్చినా, ఎలాగోలా నా బిహేవియర్ తోటో, ఏదో విధంగా, వాళ్లను ఎక్కడా పల్లెత్తు మాట అనకుండా, వాళ్లకి కూడా ఓ పశ్చాత్తాపం కలిగేలా చేసి, మళ్లీ దగ్గరకు చేసుకుంటాను. మీరు ఆఫ్ ది రికార్డు అనుకుంటారో, లేదో కానీ, విజయశాంతి, అంతకు ముందు రోజా, ఆ తరువాత మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, ఇలా అందరూ ఏమి మాట్లాడినా మళ్లీ నా దగ్గరకు తీసుకున్నా తప్ప వదులుకోలేదు.
-అవును నాకు తెలిసి, మీరు రాజకీయాల్లోకి వెళ్లినా ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు.
లేదు. అలా మాట్లాడను. ప్రతి ఒక్కరు హ్యూమన్ వాల్యూస్ తెలుసుకోవాలి. చచ్చి పోయే అవకాశం ప్రతి ఒక్కరికీ వుంది కదా. ఏదో విధంగా చనిపోవాల్సిందే. మనం సాధించింది ఏమిటి? ఎనిమిటీనా? మనం వదిలిపెట్టి వెళ్లేది మన ఫ్యామిలీకి మన వాళ్లకు పనికి వచ్చేలా వుండాలి. ఇదా మా నాన్న మంచితనం అని రామ్ చరణ్ అనుకోవాలి.
-ఎలా బతికాం అన్నది కాదు, ఎలా మిగిలాం అన్నది ముఖ్యం అని అంటారు.
అబ్బ..సూపర్..అదే నేను చెప్పాలనుకున్నది. సాధించాలనుకున్నది.
-ఈ చింతన మీకు ముందు నుంచీ వుందా?
వుండి వుంటొంది. కానీ అప్పట్లో మనం వుండే బిజీ, కెరీర్ టైమ్ లో సినిమా మీద తప్ప, మరేదీ పట్టించుకోలేదు. ఇప్పుడు లైఫ్ ను బ్యాలన్స్ చేసుకోవడంలో కానీ పరిణితి వస్తోంది. ఎవరైనా విమర్శలు చేసినా, నాకు చిన్నపిల్లల్లా అనిపిస్తారు. మారాం చేసినట్లు అనిపిస్తుంది. అంతే తప్ప కోపం రాదు. ఎవ్వరి మీదా కూడా. ఇదంతా ఏజ్ తో వచ్చే పరిణితి అనుకుంటాను.
నిజానికి పేరు మెన్షన్ చేయకూడదు కానీ, దాసరి గారండీ..నా గురించి లేని అక్కసు. లేని కోపం. అంటే ఆయన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని, గురువుగారు చెప్పండి మీరు అంటే చాలు ఆయన ఉబ్బి తబ్బిబ్బయిపోతారు. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు నాకు. ఆ తరహా మైండ్ లేదు. అదే వాళ్లకు అవసరం వుందా. నా భుజం కాస్తాను. ఎంత సాయం అన్నా చేస్తాను. కానీ వుట్టినే వాళ్లను శాటిస్ ఫై చేయడం కోసం మాత్రం ఏదో ఒకటి చేయలేను. వెళ్లలేను. బహుశా అది ఆయన కోపమేమో అనుకుంటాను.
-లైఫ్ లో డ్రామా చేయడం, నటించడం మీకు రాదేమో?
కావచ్చు. పాలటిక్స్ లోకి వెళ్లే ముందు నన్ను సంప్రదించాలి కదా, అడగాలి కదా అని ఏమైనా వుందేమో ఆయనకు. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు నన్ను అడగాలి కదా అని ఆయనకు వుందని తరువాత తెలిసింది. అయినా కూడా, ఆయన ఎక్కడైనా మీడియా ముందు నన్ను దృష్టిలో పెట్టుకుని అన్నారు అనేలా కామెంట్ చేసినా, విమర్శలు చేసినా ఏనాడూ ఆయన గురించి తప్పు మాట్లాడలేదు. ఖండించలేదు. పాలిటిక్స్ లోంచి స్లోడౌన్ అయ్యాక కూడా ఆయన దగ్గరకు వెళ్లాను. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసాక కూడా, ఆయనను నా ఫంక్షన్ కు తీసుకురావాలనుకున్నాను. ఎన్నాళ్లు వుంటారో తెలియదు. అలా మన మీద ఓ నెగిటివ్ భావంతో ఓ వ్యక్తి కనుమరుగై పోకూడదు అని అనుకున్నాను. ఆయనకు నా మీద కానీ, నాకు ఆయన మీద కానీ ఎటువంటి దురభిప్రాయం లేదు అని చెప్పాలనుకున్నాను. అందుకే 150 ఫంక్షన్ కు పిలిచాను. అలాగే ఆయనకు అల్లురామలింగయ్య అవార్డు వస్తే వెళ్లాను. ఆయన చివరి ఫంక్షన్ లు అన్నీ నా సమక్షంలో జరిగినవే. ఇదీ నేను అచ్యూవ్ చేసింది.
-అందుకే మీరు అందరివాడు అయ్యారేమో? ?ఆ టైటిల్ కు సరిపోయారేమో?
మీరు అన్నీ అబ్జర్వ్ చేసే అంటున్నారు. అందుకే కాదనలేను.
-లేదు..మిమ్మల్ని ఇప్పటికి ఒక్కసారే కలిసాను.
అవును నాకు గుర్తుంది. నా పాత ఇంట్లో లోపలి గదిలో. 150 సినిమా విడుదలకు ముందు. నేను మరచిపోలేదు. . మన ఇమేజ్ కానీ, మన స్టామినా కానీ మన ఫ్యామిలీ కే కాకుండా అందరికీ ఉపయోగపడాలి అనుకుంటాను. అందుకే అర్జున్ సురవరం, ఓ పిట్ట కథ లాంటి సినిమాల ఫంక్షన్ కు వెళ్లాను. మనం వెళ్తే వాళ్లకు ఉపయోగపడుతుంది. మనం చెబితే నలుగురు ఆ సినిమా చూస్తారు అని అనుకుంటే డెఫినిట్ గా వెళ్తాను. చిన్న పెద్ద అయినా నా సమక్షంలో ఆనందం కలుగుతుంది అంటే అది నాకు కూడా ఆనందమే.
-ఇండస్ట్రీ అన్నాక ఓ పెద్ద దిక్కు అనేది వుండాలి. ఒకప్పుడు ఎన్టీఆర్-ఎఎన్నార్ ఇద్దరు వుండేవారు. ఆ తరువాత ఇప్పుడు మీరు ఆ స్థానాన్ని భర్తీ చేసారు. అంటే ఒప్పుకుంటారా?
చాలా సార్లు తమ్మారెడ్డి భరద్వాజ, సి కళ్యాణ్ ఈ విషయంలో నన్ను ఒత్తిడిచేసారు. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి, మీరు పూనుకోవాలి అని అడిగిన సందర్భాలు వున్నాయి. లేనిది భుజం మీద వేసుకుని ఇబ్బంది పడలేను. ఒకసారి పాలిటిక్స్ లోకి వెళ్లి ఆ ప్రెజర్ అనుభవించాను. ఇక చాలు నన్ను వదిలేయండి అన్నాను. ఎప్పుడయితే ఈ కరోనా క్రయిసిస్ వచ్చిందో, అప్పుడు అనిపించింది. ఇప్పుడు కదా మనం ముందు వుండాలి. లేదంటే ఎందుకు? నలభై అయిదేళ్ల సినిమా జీవితం తరువాత ఈ టైమ్ కు రెస్పాండ్ కాకుంటే ఇక ఎందుకు అనిపించింది. ఇండస్ట్రీకి నేను ఏం తిరగి ఇచ్చాను, అని అనుకున్నాను. రైజ్ టు ది అకేషన్ అన్నట్లు టైమ్ వచ్చింది. ఎంతో కొంత పే బ్యాక్ కదా అని అనుకున్నాను.
అందుకే ముందుగా షూటింగ్ ఆపేద్దాం అనుకుని, అలాగే రోజూ మన దగ్గర పని చేసేవారు వున్నారు. వీళ్ల పరిస్థితి ఏమిటి? అద్దెలు, స్కూలు ఫీజులు, వాయిదాలు ఇవన్నీ ఊహించేసరికి ఆందోళన అనిపించింది. ఆ వెంటనే అనౌన్స్ చేసాను. కానీ అప్పటికి ఎలా చేయాలి అన్నది ఆలోచన లేదు. మోడస్ ఆఫరాండీ లేదు. కానీ సంకల్పబలం. నేను అనౌన్స్ చేయగానే నాగార్జున ముందుకు వచ్చారు. నేను కూడా ఇస్తాను. ప్రభుత్వాలకు ఇస్తే గోడకు పూసిన సున్నం అవుతుంది. ఎవరు లబ్దిదారులో తెలియకపోతే, మనకు సంతృప్తి వుండదు. మీరు మంచి పని చేసారు అంటూ నాగార్జున అభినందించారు. ఇక అందరూ వచ్చారు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ ఇలా ప్రతి ఒక్కరు. అసలు ఊహించనది బాలకృష్ణ దగ్గర నుంచి ఆయన కూడా ప్రకటించారు. ఇక రామోజీరావు గారు. అది మరీ సర్ప్రయజ్. వెంటనే ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. ఏముంది ఉడతాభక్తి అన్నారు. కానీ మా సేవ గుర్తించారు అది చాలు అన్నాను.
శంకర్, మెహర్ రమేష్, తమ్మారెడ్డి భరద్వాజ, దాము, కళ్యాణ్, గీతా బాబు ఇలా చాలా మందని చేరదీసి ఓ కమిటీ చేసి, చేసుకోండి అని అప్పచెప్పాను. కానీ తీరా చేసి, కొత్తగా ట్రస్ట్ పెట్టాలి అంటే కార్యాలయాలు లేవు. 80జి రావాలంటే ఇప్పటికిప్పుడు కాదు. అందుకే చిసిటి కింద సిసిసి ని సెపరేట్ గా ఏర్పాటు చేసాను. ఎవ్వరూ ఏ మాట అనుకూడదు, ఇదేదో నా కోసం చేస్తున్నా అని అనకూడదు అన్న మాట రాకూడదు.
అదే విధంగా ఇచ్చే సరుకులు నాణ్యతతో వుండాలి. మనం ఏం తింటున్నామో అదే ఇద్దాం అన్నాను. పామాయిల్ ఇద్దాం అంటే వద్దు, నెంబర్ వన్ నూనె ఇవ్వండి అన్నాను. ఇప్పుడు మూడు నెలలకు ఇవ్వాలని లెక్క వేసుకుంటున్నాం. జూన్ వరకు ప్రిపేర్ అవుదాం. మనకు డబ్బులు చాలకపోతే, నేను బయటకు వెళ్లడానికి చేయి జాపడానికి రెడీ. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టినా ఏ రోజు ఎవరినీ పైసా అడగలేదు. జస్ట్ ఒకటి రెండు రోజుల క్రితం కూడా 38లక్షలు ఖర్చు చేసి మరి కొన్ని కొత్త మెషినరీ తెప్పించాను. కానీ సిసిసి కోసం తానే స్వయంగా కార్పొరేట్ కంపెనీల దగ్గరకు వెళ్లి, చేయి చాచి విరాళం అడగానికి సిద్దంగా వున్నా. మెగా ఇంజనీరింగ్, జివికె, జిఎమ్ఆర్ ఇలా అందరితో పరిచయం వుంది. వెళ్లి వాళ్లను అడుగుతాను.
మనం డబ్బులు ఇస్తాం. కానీ చేయాల్సిన వాళ్లు ఎవరు? ఆ విషయంలో గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నవారందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడే బతికాం. ఇక్కడే సంపాదించాం. అందువల్ల ఇక్కడి వారికి చేయడం అన్నది నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఇండస్ఠ్రీలో యూనియన్ లు వున్నాయి. కానీ ఏవీ రిచ్ కాదు. మా సంఘంలో కూడా డబ్బులు లేవు తన్నుకు చస్తున్నారు అంతే. అందుకే కలెక్టివ్ గా ఒకటి వుండాలి అనుకున్నాను. ఇది పెట్టాను.
-సినిమా రంగానికి ఇదో రిలీఫ్ ఫండ్ మాదిరిగా వుండే అవకాశం వుందా?
ఎస్ యు ఆర్ రైట్. మీరు చెబుతుంటే అనిపిస్తోంది. దీన్ని అలా మార్చాలని. పైగా సినిమా వాళ్లకు ఏ ప్రభుత్వ స్కీములు రావు. ఇదో కార్పస్ ఫండ్ పెట్టుకుని, దాని మీద వడ్డీ ఖర్చు చేయాలి. అలాగే యూనియన్లు కొంత ఇస్తే, మనం కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని వుంది. అందుకోసం అవసరం అయితే చేయి చాచి విరాళాలు తీసుకువస్తాను. ఏదో ప్రాసెస్ చేస్తాను. దీన్ని ఎలా చేయాలి అన్నది అందరితో ఆలోచించి ప్రణాళిక రూపొందిస్తాను. అలాంటి దానికి మీ ఇన్ పుట్స్ కూడా కావాలి.
-మీరు మీ అనుభవాలు అన్నీ గ్రంధస్థం చేసే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది.
అవునండీ చేయాలి. చాలా సంఘటనలు, ఎంతో జీవితం. చాలా వుంది. రాయాల్సింది. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో? ఎవరి గురించి రాయాలో? ఏమి రాయాలో ఇంకా ఏమీ ఆలోచించలేదు. సినిమా రంగానికి మనం వెళ్లగలమా? అసలు మనకు అందుతుందా? అనుకునేవారికి నేను ఓ సోర్స్ ఆఫ్ ఇన్సిపిరేషన్ గా వున్నాను. చిరంజీవి వెళ్లాడు కదా? మనం వెళ్లలేమా? అనే భావన వచ్చేలా చేసాను. సునీల్ ,రవితేజ, కార్తికేయ ఇలా చాలా మందికి నేను ఓ ప్రోత్సాహంలా నిలిచాను. ఎన్నో అనుభవాలు, మంచి, చెడు చాలా వున్నాయి.
పైగా మా పవన్ కళ్యాణ్ ఆ మధ్య అన్నాడు. అన్నయ్యా నీతో చాన్నాళ్ల క్రితం అన్నాను గుర్తుందా, రాజ్ కపూర్ ఫ్యామిలీ మాదిరిగా మన ఫ్యామిలీ కూడా ఈ ఇండస్ట్రీలో వుండాలి అన్నాను కదా, ఇటీవల ఓ మీడియాలో చిరంజీవి సౌత్ ఇండియా రాజ్ కపూర్ అనే టైపులో వార్త వచ్చింది అన్నాడు. ఇదంతా సంకల్ప బలం. ఎన్నో తెలియని విషయాలు వున్నాయి. ఇవన్నీ ఎవి రూపంలో అందించాలా? ప్రింట్ మీడియా రూపంలో అందించాలా? అని ఆలోచిస్తున్నా. మీలాంటి వాళ్లను ఇన్ వాల్వ్ చేయాలి.
-అంతకన్నా అదృష్టమా..మీ అనుభవాల గ్రంథస్థం ప్రాజెక్టులో మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీ.
మీ ఫోన్ కన్నా ముందే బ్రహ్మానందం చేసాడు. ఆయన కూడా ఇదే అన్నాడు అన్నయ్యా, నువ్వు చెప్పాలి అన్నయ్యా అని. బ్రహ్మానందం ను జంధ్యాల పరిచయం చేసినా, నేనే భుజాన వేసుకుని ప్రమోట్ చేసాను.
-ఏమైనా ఇది ఓ బృహత్తర ప్రాజెక్టు అవుతుంది కదా?
గతంలో నేను ఇలా ఎవరైనా అంటే నాదే ముంది అనేవాడిని. కానీ ఆలోచిస్తే ఇప్పుడు అలా అనిపించడం లేదు. ఓ సాధారణ ఎక్సయిజ్ కానిస్టేబుల్ కొడకుగా నేను ఎలా వచ్చాను, నన్ను నేను ఎలా మౌల్డ్ చేసుకున్నాను. ఎలా ఈ స్థాయికి చేరుకున్నాను. ఇదంతా చాలా వుంది. నేను ఇప్పుడు నా మోడెస్టీ తోటో, సింపుల్ సిటీతోటో, అబ్బే ఏముంది అనడం సరికాదు, చెప్పాలి. చెప్పాలి. అని అనిపిస్తోంది ఇప్పుడు. షో మెన్ గా వుండు. పది మందికి మార్గదర్శనం చేయాలి అని అనిపిస్తోంది. నేను అందరితో ఆక్సెసబులిటీతో వుంటాను. రెండు సినిమాలు చేస్తే చాలు ఆ హీరోతో మీరు అంత సులువుగా మాట్లాడగలరా? కానీ నేను ఎప్పుడు ఎవరితో అయినా టచ్ లో వుంటాను. జబర్దస్త్ కమెడియన్ కావచ్చు, మరెవరు కావచ్చు నేను అందుబాటులో వుంటాను. ఇదే అమితాబ్ ను, రజనీని ఇలా కలవడం, సాధ్యం కాదు కదా?
-సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటున్నారు. పైగా మీరు స్వయంగా మీ ఖాతాను చూసుకుంటున్నట్లున్నారు.
నేను ముందుగా దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ వన్స్ దీని సంగతి తెలిసిన తరువాత నేను ఎంజాయ్ చేస్తున్నాను. జనాలు అంత రెస్పాండ్ అవుతున్నాను. ఎవరో అన్నారు. మీరు దృష్టి లో పెట్టలేదు కానీ పెడితే, దాని అంతుచూస్తారు అని. అలాగే వుంది. తరువాత మీరు ఓ విషయం బాగా ఫోకస్ చేయాలి.
నేను పదేళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత నాకు అనిపించిన సంగతి ఇది. దీన్ని మీలాంటి వాళ్లు గట్టిగా ఫోకస్ చేసి, చెప్పాలి. వృధా ఖర్చు పెరిగింది. ప్రీ ప్రొడక్షన్ తగ్గింది. కాగితాల మీద వర్క్ చేయడం మానేసారు. నోట్లు ఖర్చు పెట్టి వర్క్ చేస్తన్నారు. కేరవాన్ ల లాంటి వృధా ఖర్చులు విపరీతం అయ్యాయి. ఎవరినీ బ్లేమ్ చేయడం కాదు. కథ మీద కూర్చుదాం. ట్రీట్ మెంట్ మీద కూర్చుదాం.కాగితాలను వేస్ట్ చే యాలి కానీ కరెన్సీని వేస్ట్ చేయొద్దు. బయ్యర్లను ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు తిన్న సొమ్ము ఇది. వేరే ఉద్యోగం అయితే సిన్సియర్ గా పనిచేయడం లేదా? సినిమా అయితే మాత్రం నిర్మాతను క్యాషియర్ ను చేసి, మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదు. ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. మీరు మీ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ప్రొడ్యూసర్ కు ఎంత మిగులుతోంది అన్నది లెక్కలు వేసి, రెమ్యూనిరేషన్ తీసుకోవడాలి. దీన్ని మీరు ఎలాగైనా ఫోకస్ చేయాలి..ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది.
-తప్పకుండా. ఇక రాజకీయాల సంగతేమిటి? వదిలేసినట్లేనా?
వద్దండీ. మా ఇంట్లో. తమ్ముడున్నాడు. మిగిలిన వాళ్లు అతనికి మద్దతుగా నిలవాలి. అంతే కానీ, చెరో వైపు వుండి, మేము అతనికి సపోర్ట్ గా వున్నామన్న ఫీలింగ్, అలాగే మమ్మల్ని అభిమానించే అభిమానుల్లో అయోమయం నెలకొనకుండా వుండడం ముఖ్యం. అందువల్ల నేను నా తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాను. తను అగ్రసెవ్ గా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. ఈ రోజు కాకున్నా, ఎప్పుడో ఒకరోజు తను అనుకున్నది సాధిస్తాడు, ఆ నమ్మకం వుంది. అందువల్ల..యస్..మా సపోర్ట్ కళ్యాణ్ కే.
అదొక కారణం అయితే కాంగ్రెస్ అన్నది దాదాపు లేకుండా పోయింది. మేమంతా జాబ్ లెస్ అయిపోయాము. వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ కొత్తగా ప్రారంభించడం, ఈ 64 ఏళ్ల వయసులో అవన్నీ నేను చేయలేను. చాలు,. నా ప్రయత్నం నేను చేసాను. హానెస్ట్ గా చేసాను. మంత్రిగా నేను చాలా చేసాను. టూరిజం శాఖలో నేను మొదలుపెట్టినవి అన్నీ తరువాత ప్రభుత్వాల టైమ్ లో సాకారం అయ్యాయి. నేను మొదలుపెట్టినవి అప్పట్లో ఆగిపోయాయి. తరువాత పూర్తయ్యాయి. బోలెడు దేశాలకు ఆన్ అరైవల్ వీసా అన్నది, తిరుపతికి కల్నరీ ఇన్ స్టిట్యూట్ తీసుకురావడం కానీ ఎన్నో చేసాను.
-సినిమాల్లోకి వెళ్లినపుడు పవన్ కు సలహాలు ఇచ్చే వుంటారు. మరి రాజకీయాల్లోకి వెళ్లినపుడు ఏమన్నా చెప్పారా?
పవన్ కళ్యాణ్ కు నేనే సలహాలు ఇవ్వలేదు. తను నాతో ప్రజారాజ్యం టైమ్ లో ట్రావెల్ అయ్యాడు. నేను నమ్మిన వాళ్లు కావచ్చు, నేను చేరదీసిన వాళ్లు కావచ్చు, అన్నయ్యను దెబ్బతీసారు అన్న భావని కళ్యాణ్ లో వుంది. అన్నయ్య అందరినీ నమ్ముతాడు. స్వీట్ గా మాట్లాడిన చాలా మందిని నమ్మి చాలా నష్టాలు తెచ్చుకున్నాడు అన్న ఆలోచన వుంది. ఓకె. ఆ ఎదురుదెబ్బల నుంచి తను నేర్చుకున్నాడు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాడు.
నాదీ తనదీ దారులు వేరు కావచ్చు. కానీ గమ్యం ఒకటే. అందుకే తన దారిలోకి నేను వెళ్లి ఏం సలహాలు ఇస్తాను. అందుకే ఏ సలహాలు ఇవ్వడం లేదు. తను ఊళ్లోకి వస్తే ఇంటికి వస్తాడు. అమ్మ నా దగ్గరే వుంది. వస్తాడు. కలుస్తాడు. అందరం కలిసి భోజనం చేస్తాం. మా ఆవిడ వంట అంటే చాలా ఇష్టం. శుభ్రంగా వండిపెడుతుంది. అంతకు మించి పాలిటిక్స్ ఒక్క ముక్క కూడా మాట్లాడుకోం. తను చెప్పడు..నేను అడగను.
-ఆ మధ్య ఆంధ్ర సిఎమ్ జగన్ ను కుటుంబ సమేతంగా కలిసినట్లున్నారు.
అవునండీ. అదో అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. నాకు వైఎస్ కుటుంబంతో మొదటి నుంచీ సాన్నిహిత్యం వుంది. నన్ను వ్యక్తిగతంగా చాలా గౌరవిస్తారు. ఆ సాన్నిహిత్యంతోనే సాక్షి ఓపెనింగ్ కు పిలిస్తే వెళ్లాను. సాక్షి ఎక్స్ లెన్సీ అవార్డు ఫంక్షన్ కు భారతి పిలిస్తే వెళ్లాను. ఆమె నన్ను రిసీవ్ చేసుకున్న తీరు కానీ, ఆమె నాతో మాట్లాడిన తీరు కానీ, నన్ను ముగ్ధుణ్ణి చేసింది. చిన్న పిల్ల అయినా సరే, నాతో, నా గురించి మాట్లాడిన తీరు చాలా బాగుంది. నాతో ఆమె ఒకటే అన్నారు. మీ గురించి విన్నాను కానీ మీరు ఇంత డౌన్ టు ఎర్త్ వుంటారని అనుకోలేదు అని అనడం విశేషం. ముందు నుంచీ, అప్పటి నుంచీ ఆ స్నేహం అలా వుంది. ఇదంతా పొలిటికల్ కు అతీతం.
నిజానికి నేను వెళ్లలేకపోయాను. కానీ ప్రమాణ స్వీకారానికి పిలిచారు. కాలు బాగాలేదు. కానీ ఫోన్ లో మేసేజ్ లు, విసెష్ లు మామూలే. అప్పటి నుంచీ ఇద్దరికీ కలవాలనే వుంది. సైరా సినిమా తీసినపుడు అందరికీ చూపించాలి. మంచి సినిమా. చరిత్ర గురించి అందరికీ తెలియాలి అని చూపించే ప్రయత్నాలు చేసాను. అందులో భాగంగానే కేసిఆర్, వెంకయ్య నాయుడు, గవర్నర్ గారు ఇలా అందిరకీ ఆహ్వానాలు అందించారు.
జగన్ కు ముఖ్యంగా రాయలసీమ బిడ్డగా ఈ సినిమా చూపించాలని అనుకున్నాను. ఫోన్ చేసాను. ఆఫీసుకు రమ్మంటారేమో అనుకున్నాను. కానీ ఇంటికి రమ్మన్నారు. అది కూడా మీరు ఒంటరిగా వద్దు , అక్క ను తీసుకురండి అని ఆహ్వానించారు. నేను సురేఖ వెళ్లాం. అక్కడ జగన్, భారతి ఇచ్చిన ఆతిథ్యం కానీ, గౌరవం కానీ అస్సలు మరచిపోలేం. నా ఇమేజ్ పొలిటికల్ కు అతీతం అన్నది అర్థం అయింది. మనిషిగా మనకి అంత గుర్తింపు వున్నపుడు ఇక ఈ పాలిటిక్స్ అవసరమా? అనిపించింది.
-జగన్ గారు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించలేదా?
లేదు. నాకు ఆ స్పేస్ ఇచ్చారు. ఆ విషయమే ఆయన ప్రస్తావించలేదు. ఆ గౌరవం వుంచారు. మా మధ్య రాజకీయాలు చర్చకు రాలేదు.
-ఏదైనా అద్భుతం జరిగి, జగన్ మిమ్మల్ని తన పార్టీలోకి ఆహ్వానిస్తే..
హ్హ.హ్హ..హ్హ..అదేం లేదు. అలాంటిది వుండదు. నా స్టాండ్ ఏమిటి అన్నది మీలాంటి వాళ్ల ద్వారా బయటకు చెప్పాను. ఇంట్లో ఒకటే స్టాండ్ వుండాలి. రెండు ఉండకూడదని. మంచి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా అప్రిసియేట్ చేస్తాను. మూడు రాజధానులు అంటే అందుకే వెంటనే మంచి నిర్ణయం అని సపోర్ట్ చేసాను. ఎందుకంటే వికేంద్రీకరణ అన్నది మంచిది.
-అంతా బాగానే వుంది. అసలైన వారసుడిని ఎత్తుకునేది ఎప్పుడు?
హ్హ..హ్హ..హ్హ…ఎత్తుకోవాలనే వుంది. కానీ పిల్లలు వాళ్ల ప్లానింగ్ ఏమిటో. రామచరణ్ ను సురేఖ అడుగుతూనే వుంటుంది. ఏదో ప్లానింగ్ అంటారు. ఏమిటో తెలియదు. వాళ్ల ఇష్టం. మనం ఎంత చెప్పాలో అంతేగా చెప్పగలం.
-మీ ముగ్గురు అన్నదమ్ముల్లో మీరు సాత్వికంగా వుంటారు..ఎవరి పోలిక అమ్మదా? నాన్నదా?
అమ్మదే. నాగబాబుది చాలా వరకు నాన్న పోలిక. ఆయన కూడా చాలా అగ్రెసివ్ గా వుండేవారు. కానీ ఆయన ది కూడా దయార్థ హృదయం. రామకృష్ణ మిషన్ కు వెళ్తుండేవారు. అమ్మది కాస్త డివొషనల్ టచ్. అది నాకు వచ్చింది. కళ్యాణ్ కు ఇద్దరి పోలికలు వున్నాయి. అయినా నేను మరీ అంత సాత్వికం కాదు. తేడా వస్తే, తాట తీస్తా. ధర్మరాజుకు కోపం రాకూడదు కానీ వస్తే, అల్ల కల్లోలమే. మనం అదే టైపు. అయినా నాగబాబు కూడా వుట్టి అగ్రెవిస్ కాడు. ఎవరో నన్ను ఏదో అంటే, వాళ్లదే రక్తం, మాది కాదు అన్నట్లు మాట్లాడితే, అప్పుడు గట్టిగా ఇచ్చాడు. ఇవ్వాలి కూడా.
-థాంక్సండీ. చాలా సమయం వెచ్చించారు. గ్రేట్ఆంధ్ర పాఠకుల తరపున మీకు కృతజ్ఞతలు.
నో నో ఇట్స్ మై ప్లెజర్..ఆల్వేజ్ వెల్ కమ్. థాంక్యూ.