ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..
‘‘పెద్దిరెడ్డి నాకు సన్నిహిత మిత్రులు. రాష్ట్రాభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉంటారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి.. పేదలకు ఇస్తున్న పధకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.
చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తాం. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలి. ఎన్నో ఇబ్బందులు దాటి అనేక విషయాల్లో ఈరోజు దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నాం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ.
పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీరఖండమే అవుతుంది. దళితబంధును చూసి విపక్షాలు అదిరిపడుతున్నాయి. దళతబంధు ఆగదు.. ఎవరూ ఆపలేరు.. దశలవారీగా వందశాతం అమలు చేసి తీరుతాం. దళిత బంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.