వామ్మో కేసీయార్.. ఈ ఆవేశం అంతా నిజమేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాన్నాళ్ళ తర్వాత ఆవేశంతో ఊగిపోయారు. కేంద్రంపై దుమ్మెత్తి పోసేశారు.. బీజేపీ మీద విరుచుకుపడిపోయారు. ‘టచ్ చేసి చూడు..’ అంటూ సినిమాటిక్ డైలాగులూ పేల్చారు. ‘అంతు తేలుస్తాం..’ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరేశారు.

వామ్మో కేసీయార్.. ఏంటీ ఆవేశం.? ఇదంతా నిజమేనా.! అంటూ తెలంగాణ ప్రజానీకం ముక్కున వేలేసుకుంది. కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దాంతో, రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్ తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోవడంతో, పెట్రోల్ అలాగే లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద మరింత ఫోకస్ పెట్టాయి. పెట్రో ధరల పెంపు పాపంలో వాటా కేంద్రానిదే కాదు, రాష్ట్రాలది కూడా వుంది. రెండూ కలిసే, ప్రజల్ని నిలువునా దోచేస్తున్నాయి. కనీసపాటి కనికరం లేకుండా నడుస్తూ వచ్చింది ఈ దోపిడీ.

నిజానికి, రాష్ట్రాలు తగ్గించడం అనేది వేరే చర్చ. ముందైతే, కేంద్రం ఐదు రూపాయలు.. పది రూపాయలు కాదు.. పాతిక రూపాయలు, ఆ పైన తగ్గించాల్సి వుంది. అప్పుడే, రాష్ట్రాల మీద ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి, తెలుగు రాష్ట్రాల మీద ఇప్పుడు పెట్రో ధరలు తగ్గించాలనే ఒత్తిడి ఎక్కువగానే వున్నా, అది మరింత ఎక్కువవ్వాలంటే కేంద్రం మరింతగా పన్నుల్ని తగ్గించాల్సి వుంది.

పెట్రో ధరల వ్యవహారమే కాదు, హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ ఓడిపోయాక ఆ ఫ్రస్ట్రేషన్ కేసీయార్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఓడిపోవడం ఓ యెత్తు.. ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోవడం ఇంకో యెత్తు. ఆ మంట అంతా కేసీయార్ ఇలా తీర్చుకున్నారన్నమాట.

మోడీ సర్కార్‌ని నిలదీసేస్తాం.. తెలంగాణ బీజేపీ నేతల సంగతి చూస్తాం.. లాంటి తాటాకు చప్పుళ్ళు ఇంకెన్నాళ్ళు కేసీయార్.? అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది.