తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి వెళ్ళారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేసీఆర్ షెడ్యూల్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడాన్ని తప్పు పట్టలేం. అది ఆయన బాధ్యత కూడా.
అయితే, కరోనా వ్యాక్సిన్‌పై సమీక్షించేందుకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి వస్తే, ఆ పర్యటనలో కేసీఆర్‌కి అసలు అవకాశమే కల్పించలేదు. ప్రోటోకాల్ ప్రకారం, కేసీఆర్.. ప్రధానికి స్వాగతం పలకాల్సి వుండగా, ఆ అవకాశాన్నీ ఇవ్వలేదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. సరిగ్గా గ్రేటర్ ఎన్నికల సమయంలో జరిగిన ప్రధాని టూర్, రాజకీయ కోణంలోనే డిసైడ్ అయ్యిందా.? అన్న చర్చ అప్పట్లో జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే, గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీ పెద్దలు, పలువురు కేంద్ర మంత్రులు.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవన్నీ జస్ట్ రాజకీయ ఆరోపణలు మాత్రమేనని కొట్టి పారయలేం. ఇదిలా వుంటే, గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్లు, హంగ్ తీర్పు ఇచ్చారు. అత్యధిక సీట్లు టీఆర్‌ఎస్ సాధించినా, మేయర్ పీఠం దక్కించుకునేంత మెజార్టీ టీఆర్‌ఎస్‌కి రాలేదు. రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానంలో మజ్లిస్ పార్టీ నిలిచాయి.
ఈ నేపథ్యంలో మజ్లిస్ సాయం పొందడం కంటే, బీజేపీ సాయం అభ్యర్థించడం మేలని కేసీఆర్ భావిస్తున్నారా.? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరు. అంశాల వారీగా కేంద్రానికి, పలు సందర్భాల్లో కేసీఆర్ మద్దతునిచ్చిన విషయం విదితమే. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కేవలం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులు, నిధులు.. వంటి విషయాల కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళారా.? లేదంటే, ఇందులో రాజకీయ కోణం కూడా ఏమన్నా వుందా.? అన్నది తేలాల్సి వుంది.