కాంగ్రెస్-డ్రాగన్ భాయీభాయీ?

మన దేశం మీదకు శత్రువు దండెత్తి వచ్చి దొంగ దెబ్బ తీశాడు. మన సైనికులు వీరోచిత పోరాటం చేసి 20 మంది అమరులయ్యారు. శత్రుదేశపు సైనికులను రెట్టింపు స్థాయిలో హతమార్చారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. మన దేశ సార్వభౌమాధికారాన్ని పొరుగు దేశం సవాల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏ దేశమైనా ఏం చేస్తుంది? ఏకతాటిపై నిలబడుతుంది. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుంది. కానీ మన దగ్గర ఏం జరుగుతోంది? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీకి సహకరించకపోగా.. పొరుగుదేశానికి ఒత్తాసు పలికేలా మాట్లాడుతోంది. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ ట్వీట్ల మీద ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. చైనాకు లొంగిపోయారని, సరెండర్ మోదీ అంటూ విమర్శలు చేస్తున్నారు. మోదీని చైనా పొగడడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

దీంతో బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్ జీఎఫ్) డోనర్లలో చైనా ప్రభుత్వం కూడా ఉందని, చైనా ఎంబసీ నుంచి ఆ సంస్థకు భారీ మొత్తంలో విరాళాలు అందాయని పేర్కొనడం సంచలనం సృష్టించింది. 2005-06లో దాదాపు రూ.90 లక్షలు చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు అందాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఈ విరాళాల నేపథ్యంలోనే చైనాతో ఉచిత వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీఏ) కుదుర్చుకున్నారని, దీనివల్ల చైనాకు భారీ లబ్ధి చేకూరగా.. భారత్ కు అపార నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 2007-08లో రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాంటెపరరీ స్టడీస్ (ఆర్ జీఐసీఎస్)కు చైనా ప్రభుత్వం నుంచి 3 లక్షల డాలర్ల గ్రాంట్ వచ్చిన తర్వాతే చైనాతో ఎఫ్ టీఏ కు అడుగు పడిందనే విషయం తాజాగా వెలుగు చూసింది.

ఇక ఈ విరాళాలు ఇలా కొనసాగుతుండగా.. 2008లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో ఏముంది అనే సంగతి ఎవరికీ తెలియదు. సోనియా, జిన్ పింగ్ సమక్షంలో రాహుల్ గాంధీ, చైనా మంత్రి వాంగ్ జియాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలనూ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టలేదు. నిజానికి కాంగ్రెస్, చైనాల మధ్య బంధం ఈనాటిది కాదు. నెహ్రూ హయాం నుంచే అది కొనసాగుతోంది. హిందీ-చీనీ భాయీభాయీ అనే నినాదంతో చైనాతో చెట్టపట్టాలేసుకున్నారు. అయితే, 1962లో చైనా దురాక్రమణ చేసి తన బుద్ధి చూపించుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్, చైనా మధ్య బందం కొనసాగుతూనే వచ్చింది. చైనా కూడా కాంగ్రెస్ అగ్రనేతలు.. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

2017లో సిక్కిం వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ రహస్యంగా చైనా రాయబారిని కలవడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఒలింపిక్స్ సందర్భంగా చైనా వెళ్లిన రాహుల్ కు జరిగిన అతిథి మర్యాదలు, మానస సరోవర్ యాత్రకు వెళ్లినప్పుడు డ్రాగన్ అన్నీ తానై ఆయనకు సహకరించిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనాను పల్లెత్తు మాట అనకుండా మోదీ సర్కారుపై రాహుల్ విమర్శలు చేయడం చైనాతో ఆ పార్టీ బంధాన్ని బలపరుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా 2008లో కుదిరిన ఒప్పందం ఏమిటి? చైనా నుంచి కాంగ్రెస్ విరాళం ఎందుకు స్వీకరించింది? ఇప్పుడు చైనా పట్ల ఎందుకు మెతక వైఖరి కనబరుస్తోంది తదితర విషయాలపై క్లారిటీ ఇవ్వడం ఆ పార్టీపై ఉంది.