బాహుబ‌లి-2.. ఇది కూడా వివాద‌మేనా?

ఈ మ‌ధ్య జ‌నాలు మ‌రీ సెన్సిటివ్ అయిపోతున్నారు. సినిమాలు తీసేవాళ్లు చాలామందిని దృష్టిలో ఉంచుకోవాల్సి వ‌స్తోంది. ఏ స‌న్నివేశం వ‌ల్ల ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ తింటాయో తెలియ‌దు. ఏ డైలాగ్ వ‌ల్ల ఎవ‌రు హ‌ర్ట‌వుతారో అర్థం కాదు. తాజాగా ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ సినిమాకు సంబంధించి ఎవ్వ‌రూ ఊహించని ఓ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది.

ఈ సినిమాలో క‌టిక చీక‌టి అనే ప‌ద బంధం వాడుక‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆరె క‌టిక సంఘం ఈ డైలాగ్ పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సెన్సార్ బోర్డు ఎదుట బైఠాయించి.. ఆందోళ‌న నిర్వ‌హించింది. అంతే కాక పోలీసుల‌కు కూడా బాహుబ‌లి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై ఫిర్యాదు చేసింది.

క‌టిక చీక‌టి అనే ప‌ద‌బంధం వాడ‌టం త‌మను కించ‌ప‌ర‌చ‌డ‌మే అని ఆరె క‌టిక పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్‌ సుధాకర్ అన్నాడు. ఈ సంఘం నాయ‌కులు హైద‌రాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ డైలాగ్ మీద అభ్యంత‌రం వ్య‌క్తం చేయాల్సిన సెన్సార్ బోర్డు ఎలా అనుమ‌తి ఇచ్చింద‌ని వాళ్లు ప్ర‌శ్నించారు.

అనంత‌రం బాహుబ‌లి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌.. ప్ర‌సాద్ దేవినేనిల‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంట‌నే క‌టిక చీక‌టి అనే మాట‌ను సినిమా నుంచి తొల‌గించ‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. థియేట‌ర్ల‌ను కూడా ముట్ట‌డిస్తామ‌న్నారు. మ‌రి ఈ వివాదానికి బాహుబ‌లి టీం ఎలా ముగింపు ప‌లుకుతుందో చూడాలి.