కరోనా మూడో దశలోకి భారత్ వెళ్లిపోయిందా?

కరోనాకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రతి మాటా ఆచితూచి అన్నట్లు ఉండాలి. మిగిలిన విషయాల మాదిరి ఉత్తినే.. నోటికి తోచినట్లుగా మాట్లాడితే చోటు చేసుకునే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కరోనా వ్యాప్తికి సంబంధించి మొదటి రెండు దశలు పెద్ద ఇబ్బంది కాకున్నా.. మూడో దశకు చేరితేనే అంతులేని నష్టం జరుగుతుంది.

భారత్ లాంటి దేశంలో మూడో దశకు వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో నష్టాన్ని అంచనా వేయలేని పరిస్థితే కాదు.. కంట్రోల్ చేయటం సాధ్యం కాని పని. ఇంతకూ కరోనా మూడో దశను ఒక్క మాటలో చెప్పాలంటే.. పాజిటివ్ గా తేలిన కేసులకు మూలం ఏమిటో తెలియకపోవటం.

ఈ దశనే కరోనా మూడోస్టేజ్ గా అభివర్ణిస్తారు. ఇప్పటివరకూ దేశంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఒకట్రెండుచోట్ల ఉన్నా.. దేశం మొత్తం ఈ దశలోకి వచ్చేసినట్లుగా స్టేట్ మెంట్లు ఇవ్వటం తొందరపాటే అవుతుంది. జాతీయ ఆరోగ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. అలాంటి ఉదంతాలకు సంబంధించిన సమాచారం తమకు అందలేదని చెప్పారు.

ఒక పెద్ద సమూహంలోని వారికి ఎలాంటి కారణం లేకుండా కరోనా పాజిటివ్ రావటాన్ని కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ గా అభివర్ణిస్తారు. తెలంగాణలో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానీ ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటన ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. కొత్త కంగారు కలిగిస్తోంది. హెల్త్ కమిషనర్ కె. భాస్కర్ మాట్లాడుతూ.. కొందరికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా తేలుతుందని.. వారికి ఎలా సోకిందన్న విషయం అంతుచిక్కటం లేదన్న మాటను చెప్పారు.

ఎవరి కాంటాక్టుతో కరోనా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని గుర్తించటంలో అధికారులు విఫలమవుతున్నారా? లేక.. ఏపీలో కరోనా మూడో దశలోకి చేరుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఏపీ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు వ్యాప్తి మాత్రం పెరిగిపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.