ఇన్‌సైడ్‌ స్టోరీ: లాక్‌డౌన్‌ ఎత్తివేత దిశగా సంకేతాలు.!

మే 3 తర్వాత ఏం జరుగుతుంది దేశంలో.? కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ని కేంద్రం ఎత్తివేస్తుందా.? కొనసాగిస్తుందా.? దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం. లాక్‌డౌన్‌ని ఎత్తివేయకపోతే ఆర్థికంగా చితికిపోతాం.. ఆ తర్వాత చోటు చేసుకునే ఆకలి చావులకి ఎవరిది బాధ్యత.? అంటూ ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోపక్క, లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తే, అనూహ్యంగా దేశంలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశం వుందన్నది వైద్య రంగ నిపుణులు చెబుతున్న మాట. బతికుంటే బలుసాకు తినొచ్చు.. అన్న మాటని అన్ని సందర్భాలకూ ఆపాదించలేం. నెల రోజులు.. కష్టమే అయినా భరించాం.. ఇంకో ఇరవై రోజులు.. తప్పదనుకున్నాం.. మళ్ళీ లాక్‌డౌన్‌ కొనసాగింపు.. అంటే, ఆ తర్వాతి పరిణామాల్ని ఊహించలేం.

కానీ, ఏం చేస్తాం.? ఇంకో ఆప్షన్‌ లేదు. కేంద్రం నుంచి అందుతున్న సంకేతాల్ని బట్టి చూస్తే, మే 3 తర్వాత ఖచ్చితంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడమో, సడలింపులు ప్రకటించడమో జరుగుతుందని అన్పిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, దేశంలో అనూహ్యంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా.. కొన్ని సడలింపుల్ని కేంద్రం దఫ దఫాలుగా ప్రకటిస్తున్న విషయం విదితమే.

దాంతో, కొద్ది రోజుల్లో మరిన్ని వెసులుబాట్లు రాబోతున్నాయని దేశ ప్రజానీకం ఆశిస్తోంది. ఆ దిశగానే కేంద్ర మంత్రుల ప్రకటనలు కూడా వుంటున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా, లాక్‌డౌన్‌ లాంటి ఆంక్షలు మాత్రం కొనసాగే అవకాశం వుంది. అంటే, లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. ఆ తరహా ఇబ్బందులు తప్పవన్నమాట.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే, వేరే వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస జీవులంతా, తమ సొంత ప్రాంతాలకు పయనమవడం ఖాయం. అప్పుడు తలెత్తే పరిస్థితులు ఎలా వుంటాయి.? అన్నదానిపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా.. లాక్‌డౌన్‌ని కొనసాగించడమూ, ఎత్తివేయడమూ.. రెండూ కత్తి మీద సాములాంటి వ్యవహారాలే. మరి, కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ ఏం చేస్తుందో, ఏ ఆప్షన్‌ని ఎంచుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.