కేసులు పెరుగుతున్నా ఏపీలో ‘లాక్‌డౌన్‌’ వెసులుబాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వైరస్‌ కొత్త ప్రాంతాలకూ విస్తరిస్తోందని సాక్షాత్తూ ప్రభుత్వమే చెబుతోంది. అయితే, కంటైన్‌మెంట్‌ జోన్‌లోనే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయనీ, కొత్త ప్రాంతాల్లో వ్యాప్తి కొంత తక్కువగానే వుందన్నది ప్రభుత్వం చెబుతున్నమాట. అయినాగానీ, కరోనా వైరస్‌ సృష్తిస్తున్న మారణహోమం నేపథ్యంలో చాలా సీరియస్‌గా ‘లాక్‌డౌన్‌’ని అమలు చేయాల్సిన పరిస్థితి. కానీ, చిత్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ‘వెసులుబాట్లు’ లాక్‌ డౌన్‌ నుంచి రాష్ట్ర ప్రజలకు కల్పిస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

తాజాగా గ్రామాల్లోని మార్కెట్‌ కాంప్లెక్స్‌లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవే కాదు, ఇంకా చాలానే ‘వెసులుబాట్లు’ ప్రకటించారు. వలస కార్మికులు రాష్ట్ర పరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్ళి పనిచేసేందుకూ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇ-కామర్స్‌ కంపెనీలకూ అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

అయితే, ఈ వెసులుబాట్లు ఏవీ రెడ్‌ మరియు ఆరెంజ్‌ జోన్లకు వర్తించవు. కేవలం గ్రీన్‌ జోన్లలోనే ఈ వెసులుబాట్లు చెల్లుతాయి. అంతా బాగానే వుందిగానీ, గ్రీన్‌ జోన్‌.. అంటే ఇప్పటిదాకా కేసులు నమోదవని ప్రాంతాలు మాత్రమే. అలాగని, అక్కడ కరోనా పాజిటివ్‌ వ్యక్తులు వుండకూడదని రూల్‌ ఏమీ లేదు కదా.! శ్రీకాకుళం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు వెనుక ఎంత పెద్ద కథ నడిచిందో చూశాం. అలాంటి పరిస్థితులు ఎక్కడైనా వుండొచ్చు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాట్లు ఇవ్వడమంటే.. కొరివితో తలగోక్కున్నట్లే అవుతుంది. కానీ, ఎంత కాలం ఈ లాక్‌డౌన్‌.? అన్న ప్రశ్న చుట్టూనే.. కేంద్రం, రాష్ట్రాలకు అవకాశమిస్తోంది వెసులుబాట్లకు సంబంధించి. ఏమో, రానున్న కాలం ఎలా వుంటుందోగానీ.. కరోనా మహమ్మారి మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో కష్ట నష్టాల్ని తీసుకొచ్చింది.. దాన్నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు.