కోవిడ్ చికిత్స: బాధితుల ఆస్తులు లాగేసుకున్న ప్రైవేటు ఆసుపత్రి

కరోనా సిత్రాలు.. అనాలా.? కరోనా వైపరీత్యాలు.. అనాలా.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.. కరోనా బాధితుల్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీక్కు తినేస్తోంటే.! ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులందరికీ వైద్య చికిత్స ఫ్రీ.. ఫ్రీ.. అంటోంది బులుగు బ్యాచ్. కాదు మొర్రో.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేవారికే ఉచితం.. మిగతావారికి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితం.. అదే ప్రైవేటు ఆసుపత్రికి వెళితే అంతే సంగతులు.. అని ఎవరెంతలా మొత్తుకుంటున్నా.. బులుగు దుష్ప్రచారం అయితే ఆగడంలేదు.

అన్నట్టు, రాష్ట్రంలో 95 శాతం మంది ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేశారని ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ ఎలా జరుగుతోందబ్బా.? వేలు కాదు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుల నుంచి ఆస్తులు రాయించేసుకుంటోందట వైద్య చికిత్స నిమిత్తం. ఇప్పుడీ వ్యవహారం మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.

ఎంతగా రాజకీయ అండదండలు వుంటే తప్ప, సదరు ప్రైవేటు ఆసుపత్రి ఇంతలా బరితెగించేస్తుంది.? నిజానికి, రాష్ట్రంలో చాలా ఆసుపత్రులు చేస్తున్నది ఇదే.. నగదు రూపంలో డబ్బు కావాలంటున్నాయి.. నగదు లేకపోతే, బంగారు ఆభరణాల్ని లాగేస్తున్నాయ్.. కొత్తగా ఇప్పుడు ఆస్తులు రాయించేసుకోవడమనే కాన్సెప్ట్ రంగంలోకి దిగింది. ఏ కాన్సెప్ట్ అయితేనేం.. అంతిమ లక్ష్యం దోపిడీ.

‘ప్రాణం పోయింది.. శవాన్ని తీసుకెళ్ళాలంటే ముందు పెండింగ్ బిల్లు క్లియర్ చెయ్యాల్సిందే..’ అని నర రూప రాక్షసుల్లా ప్రవర్తించే ఆసుపత్రుల యాజమాన్యాలకు కొదవే లేదు. ‘అంతా తూచ్.. మేం, ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేసేస్తున్నాం.. రేట్లు కూడా ఫిక్స్ చేసేశాం..’ అంటూ అధికార పార్టీ చెప్పదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మేటర్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్.. అని ఊరకనే అన్లేదు.

Share